Solar Energy: సోలార్ ఇన్‌స్టాలేషన్‌కు లోన్లు ఇవ్వడానికి టాటా పవర్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఒప్పందం

by S Gopi |
Solar Energy: సోలార్ ఇన్‌స్టాలేషన్‌కు లోన్లు ఇవ్వడానికి టాటా పవర్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఒప్పందం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంకుతో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా సోలార్ ఇన్‌స్టాలేషన్ చేసుకోవడానికి మైక్రో, స్మాల్ ఎంటర్‌ప్రైజెస్(ఎంఎస్ఈ)లకు ఫైనాన్స్ సహకారం అందించనున్నాయి. ఎంఎస్ఈలకు రూ. 10 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు రుణాలు అందించేందుకు ఇండస్ఇండ్ బ్యాంకుతో జట్టు కలిశామని టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ మంగళవారం ప్రకటనలో తెలిపింది. ఈ రుణాలు బ్యాంకు క్రెడిట్ ఆమోదంపై ఆధారపడి ఉండనున్నాయి. 20 శాతం మార్జిన్ ఉన్న కంపెనీలకు, బ్యాంకింగ్ రంగంలో పోటీ ఆధారంగా వడ్డీ రేట్లు అమలవుతాయి. గరిష్ఠంగా 7 సంవత్సరాల కాలవ్యవధితో రుణాలను బ్యాంకు ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇండస్ఇండ్ బ్యాంకుతో భాగస్వామ్యం ద్వారా సోలార్ ఎనర్జీని స్వీకరించేందుకు ఎంఎస్ఈలకు సులభమైన ఫైనాన్స్ అవకాశాలను అందించడమే కాకుండా నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు, గ్రీన్ ఎనర్జీకి మారే మార్గాలను సులభతరం చేస్తుందని టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ సీఈఓ, ఎండీ దీపేష్ నందా చెప్పారు. కాగా, వాణిజ్య, నివాస సౌర ప్రాజెక్టుల కోసం ఫైనాన్స్ సౌకర్యాలను అందించేందుకు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు సోలార్ కంపెనీలతో జతకడుతున్నాయి. గత వారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో సోలెక్స్ ఎనర్జీ భాగస్వామ్యం చేసుకుంది. వాణిజ్య, పారిశ్రామిక, సంస్థాగత కస్టమర్లకు రూ. 10 కోట్ల వరకు సోలార్ ఫైనాన్సింగ్ సౌకర్యం అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed