‘మీ టైం ఆన్ మెట్రో’.. ముఖ్యమైన స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాటు

by Mahesh |
‘మీ టైం ఆన్ మెట్రో’.. ముఖ్యమైన స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాటు
X

దిశ, సిటీబ్యూరో : నిత్యం లక్షలాదిగా ప్రయాణించే మెట్రో రైల్ ఇప్పుడు ప్రయాణికులకు కొత్త అనుభూతిని అందించబోతోంది. మెట్రోలో ప్రయాణిస్తున్న అనేక మందిలో వివిధ కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో ఉన్న అభిరుచిని ప్రదర్శించుకునే గొప్ప అవకాశాన్ని మెట్రో ఇవ్వనున్నది. ఇందుకు ఎంజీబీఎస్ వంటి కొన్ని విశాలమైన స్టేషన్లలో తగిన స్థలం కేటాయించనున్నట్లు హెచ్ఎంఆర్ఎల్, హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో నిర్వహించిన ఎల్‌అండ్‌టీ మెట్రో, హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థలు ‘మి టైం ఆన్ మెట్రో’ పేరుతో మూడు రోజుల వినూత్న ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాయి.

ఈ మెట్రో పండుగను జేబీఎస్ మెట్రో స్టేషన్‌లో ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టి మెట్రో రైల్ హైదరాబాద్ ఎండీ, సీఈఓ కేవీబీ రెడ్డి బుధవారం ప్రారంభించారు. మెట్రో అంటే కేవలం కాంక్రీట్, గోడల నిర్మాణాలతో కూడిన ఒక రవాణా వ్యవస్థ మాత్రమే కాదని, ఇది హైదరాబాద్ జన జీవితాలతో ముడిపడి ఉన్న ఆత్మ వంటిదని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలన్న సీఎం సూచనలను దృష్టిలోపెట్టుకొని మెట్రో ద్వారా మరింత అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కొన్ని ముఖ్యమైన స్టేషన్ల జంక్షన్లను విశాలమైన స్థలాలను ప్రత్యేక హబ్‌లుగా, అంతర్జాతీయ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

కొత్త కారిడార్లకు మెగా జంక్షన్..

ఫేజ్-2 పార్ట్-'బి'లోని ప్రతిపాదిత జేబీఎస్-శామీర్‌పేట్ (22 కి.మీ), ప్యారడైజ్-మేడ్చల్ (23 కి.మీ) మార్గాలకు ఉమ్మడిగా మెగా జంక్షన్‌ను ఏర్పాటు చేయాలని సీఎం సూచనల మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎన్వీఎస్.రెడ్డి తెలిపారు. 2వ దశ పార్ట్ 'ఏ' 5 కారిడార్లకు సంబంధించి ఇప్పటికే కేంద్రానికి పంపిన డీపీఆర్‌లను త్వరలో ఆమోదింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. ఈ లోగా పాతనగరంలో భూసేకరణ చేస్తూనే, రోడ్డు విస్తరణకు, మెట్రో నిర్మాణానికి కూల్చివేతలు చేపట్టనున్నట్టు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ ఎండీ కేవీబీ. రెడ్డి మాట్లాడుతూ..మెట్రో రైళ్లలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లను కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆర్డర్ ఇచ్చిన 18 నెలల్లో కొత్త రైళ్లు వస్తాయన్నారు. అయితే ప్రయాణికులు ఇంకా క్రమశిక్షణను అలవర్చుకుంటే రద్దీ సమస్య చాలా వరకు తగ్గుతుందని చెప్పారు. మీ టైం ఆన్ మెట్రో ప్రచారంలో భాగంగా లఘు చిత్రాలను, నృత్యాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. సంక్రాంతి సంబురాలు, ఈ ప్రచార కార్యక్రమం ప్రతిబింబించేలా రూపొందించిన మెట్రో రైలును ఎన్వీఎస్ రెడ్డి, కేవీబీ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

Advertisement

Next Story