TG Govt: టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే

by Gantepaka Srikanth |
TG Govt: టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలకు సుపరిపాలన అందించాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం లక్ష్యం అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గురువారం "మీ టికెట్" యాప్‌ను శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ సాయంతో పౌర సేవలను ప్రజల ముంగిటకు చేరవేస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఇకనుంచి టికెట్ ఏదైనా ‘మీ టికెట్’ యాప్ ఒక్కటీ మీ దగ్గరుంటే చాలన్నారు. ఆర్టీసీ, మెట్రో టికెట్లు, తెలంగాణలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, ఇతర సేవలకు సంబంధించిన టికెట్లు, పార్కులు, ఇతర పర్యాటక స్థలాల్లో క్యూలైన్లలో నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఎంట్రీ టికెట్లను ఒకే ఒక్క క్లిక్‌తో మీసేవ రూపొందించిన ఈ ‘మీ టికెట్ యాప్’లో బుక్ చేసుకోవచ్చునన్నారు. ముఖ్యంగా ఈ ప్రక్రియలో సంబంధిత నిపుణులను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. అన్ని రకాల టికెట్ బుకింగ్స్‌ను ఒకే ప్లాట్ ఫాంపైకి తెచ్చేందుకు వీలుగా ఈ యాప్‌ను రూపొందించామని, రాబోయే రోజుల్లో ఇలాంటి తరహా యాప్‌లను మరిన్ని అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి శ్రీదర్​బాబు వివరించారు.

‘మీ టికెట్ యాప్’లో తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు, మెట్రో, ఆర్టీసీ, మ్యూజియాలు, జూ, ప్లే అండ్ ఎంటర్ టైన్ మెంట్ జోన్స్‌కు సంబంధించిన టికెట్లను తీసుకోవచ్చునన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కమ్యూనిటీ హాళ్లు, జిమ్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను బుకింగ్ చేసుకోవచ్చునని, మీరు ఎంచుకున్న లొకేషన్‌కు సమీప ప్రాంతాల్లోని చూడదగిన ప్రదేశాలుంటే.. ఆ సమాచారం కూడా మీ టికెట్ యాప్‌లో ఆటోమేటిక్‌గా కనిపిస్తుందని తెలిపారు. ఈ యాప్‌ను చాలా సులువుగా వినియోగించుకోవచ్చునని, యూపీఐ ద్వారా చెల్లింపులు కూడా చేయొచ్చన్నారు. ఇతర ప్లాట్ ఫాంల మాదిరిగా ఈ యాప్‌లో అదనంగా ఎలాంటి ఛార్జీలను వసూలు చేయబోమని మంత్రి శ్రీదర్ బాబు వివరించారు. ఈ కార్యక్రమంలో మీసేవ కమిషనర్ రవి కిరణ్, డిప్యూటీ డైరెక్టర్​(ఫైనాన్స్​) మీసేవ జి. వరలక్ష్మీ, డిప్యూటీ డైరెక్టర్​(అడ్మిన్) మీసేవ విజయ భాస్కర్​గౌడ్, పరిశ్రమల శాఖా కమిషనర్ డా.జి.మల్సూర్, జూపార్క్స్ డైరెక్టర్ డా.సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story