BSP: బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలిగా మరోసారి మాయావతి

by Harish |
BSP: బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలిగా మరోసారి మాయావతి
X

దిశ, నేషనల్ బ్యూరో: బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా 68 ఏళ్ల మాయావతి మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో బీఎస్పీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, జాతీయ స్థాయి సీనియర్ నాయకులు, రాష్ట్ర స్థాయి పార్టీ నేతలు ఇంకా పలువురు పాల్గొన్నారు. ఇటీవల మాయావతి ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రచారం జరుగుతుండగా, రెండు రోజుల క్రితం వీటిని కొట్టిపారేయగా, తాజాగా ఏకగ్రీవంగా జాతీయ అధ్యక్షురాలిగా మరోసారి ఎన్నికవడం గమనార్హం.

ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాయావతి మాట్లాడుతూ, దళితులు, ఆదివాసీలు మొదలగు వారి అభ్యున్నతి కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని పార్టీ అనుచరులతో అన్నారు. బహుజనుల ఆత్మగౌరవం, డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ప్రారంభించిన ఉద్యమం ఊపందుకుంటుందని, దాని లక్ష్యం నుండి మళ్లించలేని విధంగా బలంగా మారిందని చెప్పారు.

ఎన్నికల్లో ప్రతికూల పరిణామాలు ఎదురైనప్పటికీ, బీఎస్పీ నిరాశ చెందలేదు. దోపిడీకి గురవుతున్న, పీడిత ప్రజలందరి తరఫున పోరాటానికి సిద్ధంగా ఉందని అన్నారు. అలాగే, కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు దేశంలోని మైనారిటీలు, వెనుకబడిన వర్గాల "నిజమైన శ్రేయోభిలాషులు" కాదని మాయావతి విమర్శించారు. మాయావతి ఉత్తరప్రదేశ్‌కు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ ఆమెను తన రాజకీయ వారసురాలిగా రెండు దశాబ్దాల క్రితమే ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed