Mallikarjun Kharge: రాహుల్ పై అనుచిత వ్యాఖ్యలు.. ప్రధాని మోడీకి ఖర్గే లేఖ

by vinod kumar |
Mallikarjun Kharge: రాహుల్ పై అనుచిత వ్యాఖ్యలు.. ప్రధాని మోడీకి ఖర్గే లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై చేసిన ప్రకటన తర్వాత బీజేపీ, దాని మిత్ర పక్షాల నేతలు రాహుల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మంగళవారం ప్రధాని మోడీకి లేఖ రాశారు. ‘కేంద్ర మంత్రి రవ్‌నీత్ బిట్టు రాహుల్‌ను నంబర్ వన్ టెర్రరిస్ట్‌గా అభివర్ణించారు. అలాగే బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాహుల్ పై దాడి చేస్తామని బెదిరించారు. మీ కూటమికి చెందిన మరో ఎమ్మెల్యే రాహుల్ నాలుక కోస్తే రూ.11లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలన్నీ తీవ్రంగా కలచివేస్తున్నాయి. ఇవి భారత ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు విరుద్ధం. కాబట్టి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారందరిపై వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని లేఖలో పేర్కొన్నారు.

ప్రతిపక్ష నాయకుడిని ఉద్దేశించి చేసిన ఇలాంటి వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారి నుంచి వచ్చాయని తెలిపారు. మీ కూటమిలోని రాజకీయ నాయకులు ఉపయోగించిన హింసాత్మక భాష భవిష్యత్తుకు పెను ప్రమాదంగా మారనుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి బీజేపీ, దాని మిత్రపక్షాలకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. అటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మీ కూటమిలోని రాజకీయ నాయకులకు క్రమశిక్షణ నేర్పించాలని మోడీకి విజ్ఞప్తి చేశారు. కాగా, రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి రూ. 11 లక్షలు ఇస్తానని షిండే శివసేన నేత సంజయ్ గైక్వాడ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే ఖర్గే లేఖ రాయడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed