J&K: స్పృహతప్పి పడిపోయిన మల్లికార్జున్ ఖర్గే

by Harish |
J&K: స్పృహతప్పి పడిపోయిన మల్లికార్జున్ ఖర్గే
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మూలో ప్రసంగిస్తూ వేదికపై స్పృహతప్పి పడిపోయారు. దీంతో కొన్ని నిమిషాల పాటు ప్రసంగాన్ని ఆపాల్సి వచ్చింది. జస్రోటా అసెంబ్లీ నియోజకవర్గంలోని బర్నోటిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వేదికపై ఉన్న సిబ్బంది వెంటనే అలర్ట్ అయి ఆయనను పడిపోకుండా పట్టుకుని సీట్లో కూర్చోబెట్టి త్రాగడానికి నీటిని అందించారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం, కూర్చోనే తన ప్రసంగాన్ని ప్రారంభించారు, ఆ తర్వాత మళ్లీ మధ్యలో ఆపేశారు. మళ్ళీ లేచి నిలబడి పార్టీ నేతలు ఆయనను పట్టుకుని నిలబడి ఉండగా 2 నిమిషాల పాటు ప్రసంగించారు.

ప్రసంగం అనంతరం వెళ్లే సమయంలో నాకు 83 ఏళ్లు, నేను అంత తొందరగా చనిపోను, మోడీని అధికారం నుంచి దించే వరకు చనిపోను అని అన్నారు. ఆ తర్వాత ఖర్గేకు వైద్యులు చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ ఘటనపై ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఎక్స్‌లో స్పందించారు. జస్రోటాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్నప్పుడు, ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు, వైద్యులు ఆరోగ్య పరిస్థితిని చెక్ చేశారు. రక్తపోటు కొంచెం తక్కువగా ఉంది. ప్రస్తుతం బాగానే ఉన్నారు. ఆయన సంకల్పం, ప్రజల ఆశీస్సులు ఆయన్ను బలంగా ఉంచుతాయని అన్నారు.

ఇదిలా ఉంటే తన ప్రసంగంలో మల్లికార్జున్ ఖర్గే, బీజేపీపై విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఎన్నికలు జరపాలని కోరుకోలేదు, వారు కావాలంటే ఏడాది, రెండేళ్లలోపు ఎన్నికలు నిర్వహించి ఉండేవారు, కానీ అలా చేయలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికలకు సిద్ధమయ్యారు. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా రిమోట్ కంట్రోల్డ్ ప్రభుత్వాన్ని నడపాలనుకున్నారని ఖర్గే బీజేపీపై విమర్శలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed