మేజర్ రాధికకు ఐరాస అవార్డు.. ఎందుకంటే..

by Hajipasha |
మేజర్ రాధికకు ఐరాస అవార్డు.. ఎందుకంటే..
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత ఆర్మీకి చెందిన మేజర్‌ రాధికా సేన్‌కు ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరానికిగానూ ‘మిలటరీ జెండర్‌ అడ్వకేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును అందించింది. గురువారం ఈ పురస్కారాన్ని ఆమెకు యూఎన్ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రదానం చేశారు. కాంగోలో స్త్రీలు, బాలికల పట్ల హింస చోటు చేసుకోకుండా రాధికా సేన్‌ చూపిన శాంతి ప్రబోధానికి, ప్రచారానికి గుర్తింపుగా ఈ అవార్డును అందించినట్లు గుటెర్రెస్ తెలిపారు. రాధికను నిజమైన నాయకురాలు, రోల్ మోడల్‌గా ఆయన అభివర్ణించారు.ఐక్యరాజ్య సమితి శాంతి దళాలలో భాగంగా ఆర్మీ మేజర్‌ రాధికా సేన్‌ 2023 ఏప్రిల్‌లో ‘డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో’కు వెళ్లారు. ‘ఇండియన్‌ రాపిడ్‌ డిప్లాయ్‌మెంట్‌ బెటాలియన్‌’కు ఆమె కమాండర్‌గా పనిచేశారు. కాంగోలోని నార్త్‌ కీవో ప్రాంతంలో రాధికా సేన్‌ పనిచేశారు. ఇక మధ్య ఆఫ్రికాలో రెండు కాంగోలు ఉన్నాయి. ఒకటి ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో’, మరొకటి ‘డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో’. ఆఫ్రికాలో రెండో అతి పెద్ద దేశం డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో. ఇది ఒకప్పుడు బెల్జియం వలస దేశం. ఈ దేశంలో ‘ఎయిడెడ్‌ డెమొక్రటిక్‌ ఫోర్సెస్‌’ అనే గ్రూప్, ‘హుతూస్‌’ అనే మరో గ్రూప్‌ నిత్యం పరస్పర దాడులకు పాల్పడుతుంటాయి. వీరిని అదుపు చేయడానికి వచ్చే దేశ సైన్యం వీరి కంటే ఎక్కువ హింసకు పాల్పడుతోంది. అందుకే హింసను నిలువరించేందుకు ఐక్యరాజ్య సమితి శాంతి దళాలకు ఆ దేశంలో మోహరించారు.

Advertisement

Next Story