ఎన్నికల బరిలో కన్హయ్య.. ఏ పార్టీ.. ఏ సీటు ?

by Shamantha N |
ఎన్నికల బరిలో కన్హయ్య.. ఏ పార్టీ.. ఏ సీటు ?
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌ సభ ఎన్నికల మరోజాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. మొత్తం పదిమంది అభ్యర్థులతో కాంగ్రెస్ కొత్త జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో ఢిల్లీ, పంజాబ్, అళహాబాద్ అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. పొత్తులో భాగంగానే ఢిల్లీలో మూడు సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఈశాన్య ఢిల్లీ నుంచి కన్హయ్య కుమార్ బరిలో దిగుతున్నారు. బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీకి వ్యతిరేకంగా బరిలో దిగుతున్నాడు కన్హయ్య కుమార్.

చాందినీ చౌక్‌ నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జై ప్రకాష్‌ అగర్వాల్‌ను పోటీకి దింపింది. అతను 1984, 1989, 1996లో ఈ స్థానం నుంచి గెలుపొందారు. రిజర్వ్‌డ్ సీటు అయిన నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి ఉదిత్ రాజ్ బరిలో ఉన్నారు. 2014లో బీజేపీ టికెట్ పైన ఆయన ఈస్థానంలో గెలిచారు.

పంజాబ్‌లోని ఆరు స్థానాలకు కూడా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. జలంధర్ నుంచి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ పోటీ చేయనున్నారు. అమృత్ సర్ నుంచి గుర్జీత్ సింగ్ ఔజ్లా, ఫతేగఢ్ సాహిబ్ నుంచి అమర్ సింగ్, బఠిండా నుంచి జీత్ మొహిందర్ సింగ్ సిద్ధూ, సంగ్రూర్ నుంచి సుఖ్‌పాల్ సింగ్ ఖైరా, పటియాలా నుంచి ధరమ్‌వీర్ గాంధీలకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. ఇకపోతే ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ స్థానానికి అభ్యర్థిగా రేవతి రమణ్ సింగ్ ను బరిలో దింపింది.

దేశవ్యాప్తంగా ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఢిల్లీలో మే 25న ఒకేదశలో ఎన్నికలు జరగనున్నాయి.జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Advertisement

Next Story