ప్రపంచ రికార్డు సృష్టించిన భారత ఎన్నికల సంఘం

by S Gopi |
ప్రపంచ రికార్డు సృష్టించిన భారత ఎన్నికల సంఘం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎన్నికల ఫలితాలకు మరికొన్ని గంటలే మిగిలుంది. ఈ సమయంలో భారత ఎన్నికల సంఘం(ఈసీ) సోమవారం ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఎన్నికల పోలింగ్ జరిగిన తర్వాత, కౌంటింగ్‌కి ముందు ఇటువంటి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మాట్లాడిన ఈసీ ప్రధాన అధికారి రాజీవ్ కుమార్.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాం. ఈ ఎన్నికల్లో మొత్తం 64.2 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది ప్రపంచ రికార్డు అని ఆయన పేర్కొన్నారు. ఈ సంఖ్య జీ7 దేశాల్లో ఉన్న మొత్తం ఓటర్ల కంటే 1.5 రెట్లు ఎక్కువ, యూరప్‌లోని 27 దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ. ప్రధానంగా ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున ముందుకొచ్చారని, మొత్తం 31.2 కోట్ల మంది మహిళలు ఓటు వేశారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ మహిళా ఓటర్లకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ కావడంతో 1.5 కోట్ల మంది పోలింగ్, సెక్యూరిటీ సిబ్బంది డ్యూటీ చేశారు. 68,763 బృందాలు ఎన్నికల పర్యవేక్షణను చేపట్టాయి. అలాగే, ఎన్నికల కోసం 135 ప్రత్యేక రైళ్లు, ఎన్నికల ప్రక్రియ కోసం 4 లక్షల వాహనాలను ఉపయోగించినట్టు ఈసీ వెల్లడించింది. గత ఎన్నికల్లో 540 చోట్ల రీపోలింగ్ నిర్వహించాల్సి రాగా, ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో 39 చోట్ల మంది మాత్రమే రీపోలింగ్ అవసరం ఏర్పడింది. ఇందులో కేవలం రెండు రాష్ట్రాల్లోనే 25 స్థానాల్లో రీపోలింగ్ జరిగింది. ఇక, ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే నగదు ప్రవాహాన్ని ఈసీ విజయవంతంగా అడ్డుకున్నట్టు ప్రకటించింది. ఈ ఎన్నికల్లో రూ. 10,000 కోట్లను స్వాధీనం చేసుకున్నట్టు రాజీవ్ కుమార్ చెప్పారు. 2019లో ఈ సంఖ్య రూ. 3,477 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో సీ-విజిల్ యాప్‌లో మొత్తం 4.56 లక్షల ఫిర్యాదుల్ అందాయని, వాటిలో 99.9 శాతం ఫిర్యాదులను పరిష్కరించినట్టు రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఇందులోనూ 87.5 శాతం సమస్యలను కేవలం 100 నిమిషాల వ్యవధిలోనే పరిష్కరించామని, డీప్‌ఫేక్ లాంటి వాటిని కట్టడి చేశామని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story