Shimla protest: హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఉద్రిక్తత

by Shamantha N |
Shimla protest: హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఉద్రిక్తత
X

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh) రాజధాని సిమ్లా (Shimla)లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సంజౌలి ప్రాంతంలో నిర్మించిన మసీదులో (Sanjauli Mosque) అక్రమంగా అదనపు అంతస్తులు నిర్మించారని ఆరోపిస్తూ స్థానికులు నిరసన చేపట్టారు. దేవభూమి సంఘటన్‌ ఆధ్వర్యంలో హిందూ సంఘాలు, స్థానికులు బుధవారం మసీదు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పదేళ్ల కిందట చట్టవ్యతిరేకంగా నిర్మించిన నాలుగంతస్తుల మసీదును కూల్చివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ‘హిమాచల్‌ నే తానా హై, దేవభూమి కో బచానా హై’, ‘భారత్‌ మాతా కీ జై’ వంటి నినాదాలు చేశారు. కాగా.. పోలీసులు నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్‌ చేశారు. వాటర్‌కేనన్లను వాడారు.

నిరసనకు పిలుపునిచ్చిన హిందూ సంఘాలు

అయితే, మసీదులో అదనపు అంతస్తుల నిర్మాణాలపై కొన్ని హిందూ సంఘాలు నిరసనకు పిలుపునిచ్చాయి. మంగళవారం మసీదు ప్రాంతంలో నిషేధాజ్ఞలు జాచరీ చేశారు. కాగా.. బుధవారం తెల్లవారుజామున నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో, ఉద్రిక్తగా మారింది. నిరసన ప్రదర్శనకు ముందు ధల్లి సొరంగంలో భారీగా పోలీసు బలగాలు కనిపించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు పోస్టుల వద్ద వాహనాలను తనిఖీ చేశారు. అయినప్పటీకి, ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సిమ్లా ఎస్పీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. వాటాదారులతో సమావేశాలు నిర్వహించామన్నారు. నిరసన శాంతియుతంగా జరగాలని ఆందోళన కారులను కోరారు.

హిమాచల్ సీఎం ఏమన్నారంటే?

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖూ(Himachal Pradesh Chief Minister Sukhvinder Singh Sukhu ) నిరసనలపై స్పందించారు. నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉన్నప్పటికీ.. వారు శాంతియుతంగా, ప్రజాఆస్తులకు నష్టం కలిగించకుండా చేయాలన్నారు. సంజౌలి మసీదులో అక్రమంగా నిర్మించారని ఆరోపించిన అంశాన్ని స్థానిక మున్సిపల్ కోర్టు విచారిస్తోందని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని సీఎం సుఖు పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ మంత్రి రోహిత్ ఠాకూర్(Himachal Pradesh Minister Rohit Thakur) మాట్లాడుతూ.."మా రాష్ట్రంలో ఎప్పుడూ మతపరమైన అల్లర్లు జరగలేదు. హిమాచల్‌ను దేవభూమి అంటారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉంది. జనజీవనం సాఫీగా సాగుతోంది. నిరసన చేయడం ప్రజల హక్కు, అయితే ప్రతిదీ చట్ట పరిధిలో జరగాలి" అని హితవు పలికారు.

Advertisement

Next Story