అమెజాన్ పార్సిల్ బాక్స్ లో నాగు పాము.. వెన్నులో వణుకు పుట్టించే సీన్

by Prasad Jukanti |   ( Updated:2024-06-19 07:18:19.0  )
అమెజాన్ పార్సిల్ బాక్స్ లో నాగు పాము.. వెన్నులో వణుకు పుట్టించే సీన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ కామర్స్ వెబ్ సైట్లలో ఒక వస్తువును ఆర్డర్ చేస్తే మరో వస్తువు డెలివరీ చేయడం చూస్తూనే ఉంటాం. కొన్ని సార్లు వస్తువును కాదని రాళ్ళు, ఇటుకలను చేతిలో పెట్టిన ఘటనలూ వెలుగు చూశాయి. కానీ బెంగళూరులోని ఓ సాఫ్ట్ వేర్ జంటకు మాత్రం అమెజాన్ లో చేసిన ఓ ఆర్డర్ పీడకలలా మారింది. రెండు రోజుల క్రితం అమెజాన్ లో బెంగళూరులోని సర్జాపూర్ రోడ్డులో నివసిస్తున్న దంపతులు ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ను ఆర్డర్ చేశారు. దీంతో డెలివరీ బాయ్ వచ్చి వారి పార్సిల్ అందించి వెళ్లిపోయాడు. ఆ తర్వాత దానిని ఓపెన్ చేస్తుండగా ఆ పార్సిల్ బాక్స్ లో విషపూరితమైన నాగుపాము దర్శనం ఇచ్చింది. ఇది చూసిన ఆ దంపతులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే ఆ పాము పార్సిల్ బాక్స్ టేప్ కు అతుక్కుపోయి ఉండటం వల్ల బయటకు రాలేకపోయింది.

వెంటనే ఆ బాక్స్ ను ఓ బకెట్ లో ఉంచి వీడియో తీశారు. తమకు ఎదురైన ఈ అనుభవాన్ని సోషల్ మీడియాలో ఆ పోస్ట్ చేశారు. దీనిపై అమెజాన్ స్పందించింది. మీకు కలిగిన అసౌకర్యం కలిగించినందుకు క్షమించాలని కోరింది. ఈ పొరపాటు ఎలా జరిగిందో చెక్ చేసుకుంటాం. మీ వివరాలను మాకు తెలియజేయండి. మా టీమ్ త్వరలోనే మీకు అప్ డేట్ అందిస్తుంది అని ట్వీట్ చేసింది. కాగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటినజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇది బై 1 గెట్ వన్ ఆఫర్ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా మరొకరు అమెజాన్ సంస్థ డైరెక్ట్ గా అమెజాన్ అడవుల నుంచి సప్లయి చేస్తోందని ఫన్నీ కామెంట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed