పట్టాలు తప్పిన లోకో పైలట్ల లైఫ్..కాంగ్రెస్ ఎంపీ రాహుల్

by vinod kumar |
పట్టాలు తప్పిన లోకో పైలట్ల లైఫ్..కాంగ్రెస్ ఎంపీ రాహుల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో లోకో పైలట్ల జీవిత రైలు పూర్తిగా పట్టాలు తప్పిందని కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. వారి ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంటులో ఇండియా కూటమి గళం విప్పుతుందని తెలిపారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో లోకో పైలట్‌లతో రాహుల్ ఇటీవల సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు వారితో మాట్లాడుతున్న ఓ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. లోకో పైలట్లు రోజుకు 16 గంటలు వేడితో ఉడుకుతున్న క్యాబిన్‌లలో కూర్చొని పని చేయవలసి వస్తోందన్నారు. పని గంటలకు పరిమితి లేదని, సెలవులు కూడా సరిగా ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల వారు మానసికంగా, శారీరంగా కుంగిపోయి..అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో లోకో పైలట్లు రైళ్లను నడిపించడం వల్ల వారి ప్రాణాలతో పాటు ప్రయాణికుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే చాన్స్ ఉందన్నారు. పార్లమెంటులో ఈ సమస్యలన్నింటినీ లేవనెత్తుతానని హామీ ఇచ్చారు.

మణిపూర్‌లో పర్యటించనున్న రాహుల్

రాహుల్ గాంధీ సోమవారం ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో పర్యటించనున్నారు. జిరిబామ్, చురచంద్‌పూర్, ఇంఫాల్ జిల్లాల్లో హింసాకాండ బాధిత ప్రజలను పరామర్శిస్తారు. రాహుల్ పర్యటనే నేపథ్యంలో మణిపూర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కైషమ్‌ మేఘచంద్ర, ఇబోబి సింగ్‌, అంగోమ్‌చా బిమోల్‌ అకోయిజం, ఆల్‌ఫ్రెడ్‌ కన్ంగమ్‌ ఆర్థర్‌ లు సమావేశమై చర్చించారు. సహాయక శిబిరాల్లో నివసిస్తున్న ప్రజలతోనూ రాహుల్ సంభాషిస్తారని పార్టీ నేతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed