Lawrence Bishnoi: బాబా సిద్ధిఖీని హత్య చేసింది మేమే.. బిష్ణోయ్ గ్యాంగ్ వెల్లడి

by Shamantha N |
Lawrence Bishnoi: బాబా సిద్ధిఖీని హత్య చేసింది మేమే.. బిష్ణోయ్ గ్యాంగ్ వెల్లడి
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీని హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. కాల్పులు జరిగిన కొన్ని గంటల తర్వాత ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించింది. శిబు లోంకర్‌కు చెందిన ఫేస్‌బుక్ ఖాతాతో లింక్ చేయబడిన పోస్ట్‌పై కేంద్ర ఏజెన్సీలు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాయి. కాగా.. శిబు లోంకర్ బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన వ్యక్తే. శిబు లోంకర్ అసలు పేరు శుభమ్ రామేశ్వర్ లోంకర్. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో మహారాష్ట్రలోని అకోలా నుండి ఈ ఏడాది ప్రారంభంలో శుభమ్ లోంకర్ అరెస్టయ్యాడు. అతనికి బిష్ణోయ్ నెట్‌వర్క్‌తో బలమైన సంబంధాలు కలిగి ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల విచారణలో, లారెన్స్ సన్నిహితుడు అన్మోల్ బిష్ణోయ్‌తో వీడియో కాల్స్ ద్వారా కమ్యూనికేట్ చేశానని గతంలోనే శుభమ్ అంగీకరించాడు.

బాబా సిద్ధిఖీ హత్య

ఇకపోతే, శనివారం రాత్రి అజిత్ పవార్ ఎన్సీపీ వర్గానికి చెందిన బాబాసిద్ధిఖీని(Baba Siddique) హత్య జరిగింది. ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి కార్యాలయంలో ఉండగా.. పలువురు దుండగులు అతడిపై కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే ఆయన్ను మాత్రమే లీలావతి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ కేసులో హర్యానాకు చెందిన కర్నైల్ సింగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ కశ్యప్ అరెస్టయ్యారు. వారిద్దరూ తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌(Lawrence Bishnoi)కు చెందినవారమని పేర్కొన్నట్లు ఇప్పటికే పోలీసు వర్గాలు వెల్లడించాయి. మూడో నిందితుడైన యూపీకి చెందిన శివకుమార్‌ను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. సిద్ధిఖీని హత్య చేయడానికి నిందితులు కొన్ని నెలలుగా వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది. ఈ హత్య చేసినందుకు గాను నిందితులకు ఒక్కొక్కరికి బిష్ణోయ్‌ గ్యాంగ్‌ రూ.50,000 అడ్వాన్స్‌, వెపన్స్ ఇచ్చినట్లుగా తమ విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed