రాజ్యాంగానికి లోబడే మండలి చీఫ్ విప్‌గా పట్నం నియామకం : మంత్రి శ్రీధర్‌ బాబు

by Y. Venkata Narasimha Reddy |
రాజ్యాంగానికి లోబడే మండలి చీఫ్ విప్‌గా పట్నం నియామకం : మంత్రి శ్రీధర్‌ బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పట్నం మహేందర్ రెడ్డికి ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీశ్ రావుపై మంత్రి శ్రీధర్‌ బాబు మండిపడ్డారు. పట్నం నియామకాన్ని తప్పుబట్టిన మంత్రి శ్రీధర్ బాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. అపోజిషన్ పార్టీ వాళ్లను అడిగి ఎవరిని నియమించాలి? ఎవరిని నియమించకూడదు అని అడుగుతారా? అని నిలదీశారు. మండలి ఆవరణలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘చీప్ విప్ గా ఎంపిక చేయడం అనేది ప్రధానంగా రెండు వ్యవస్థలు... అసెంబ్లీలో గానీ, మండలిలో గానీ చైర్మన్ పక్షాన అటు స్పీకర్ రాజ్యాంగం పరిధిలోనే ఎంపిక చేసుకొని ముందుకు వెళ్లడం జరుగుతుంది... రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఎవరు ఏం పనిచేయలేరు. ఇక్కడ. చేయలేరు కూడా’ అని స్పష్టం చేశారు. స్పష్టంగా ఏ నియామకం జరిగినా రాజ్యాంగ బద్ధంగానే జరిగిందని, రాజకీయ పరంగా ఏదైనా బురదజల్లే కార్యక్రమం చేయాలంటే వ్యవస్థలను ఉపయోగించొద్దని హితవు పలికారు.

రాజ్యాంగానికి లోబడే పట్నం మహేందర్ రెడ్డిని మండలి చీఫ్ విప్‌గా నియమించామని స్పష్టం చేశారు. హరీష్ రావు అన్నింటిని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటు కౌన్సిల్ గానీ, అటు అసెంబ్లీ గానీ వ్యవస్థకు సంబంధించిన అంశాలను కూడా రాజకీయం చేయాలని, ఆలోచన చేస్తే ఏమైనా సమాధానం ఉంటదా? అని నిలదీశారు. మండలి చీఫ్ విప్‌గా పట్నం మహేందర్‌రెడ్డిని నియమించడాన్ని కారు పార్టీ జీర్ణించుకోలేక పోతోందా? అని ప్రశ్నించారు.

హరీష్‌రావు శాసనసభ వ్యవహారాలమంత్రిగా ఉన్నప్పుడు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లో ఎలా చేర్చుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో రాజ్యాంగం గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. పీఏసీ ఛైర్మన్ పదవిని సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికే ఇచ్చామన్నారు. ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడా రాజ్యాంగ ఉల్లంఘన జరగలేదని, పీఏసీ చైర్మన్, చీఫ్ విప్ నియామకాలు రాజ్యాంగం ప్రకారమే జరిగాయని వివరించారు. వ్యవస్థలను హరీష్ రావు రాజకీయాల్లోకి లాగుతున్నారని ఇది మానుకోవాలని సూచించారు.

Advertisement

Next Story