అది ఎన్కౌంటర్ కాదు... ఫాసిస్ట్ హత్యలు…లేఖ విడుదల మావోలు

by Kalyani |
అది ఎన్కౌంటర్ కాదు... ఫాసిస్ట్ హత్యలు…లేఖ విడుదల మావోలు
X

దిశ, భద్రాచలం : ఛతిస్గడ్ చరిత్రలోనే అతి పెద్ద ఎన్కౌంటర్ జరిగిన వారం రోజుల తర్వాత మావోయిస్టులు స్పందించారు. ఎన్కౌంటర్ మృతుల వివరాలను పేర్కొంటూ ఆదివారం ఒక లేఖను విడుదల చేశారు. అక్టోబర్ 4వ తేదీన ఛతిస్గడ్ నారాయణపూర్ జిల్లా గోవాడి, బోండోస్, తుల్తూలి - బస్తర్ మధ్య అటవీ ప్రాంతంలో జరిగినది ఎన్కౌంటర్ కాదని, అవి ఫాసిస్ట్ హత్యలని పూర్వ బస్తర్ డివిజనల్ కమిటీ పేరుతో విడుదల చేసిన లేఖలో ఆరోపించారు. భద్రతా బలగాలు విచక్షణారహితంగా నర సంహారానికి పాల్పడ్డారని, దీనిని ప్రజాస్వామిక, ప్రగతిశీల, లౌకిక, విప్లవాత్మక సామాజిక సంస్థలు ఖండించాలని మావోలు ఆ లేఖలో కోరారు.నాలుగో తేదీ ఉదయం 11:30 కు ప్రారంభమైన కాల్పులు, రాత్రి 9 గంటల వరకు కొనసాగాయని పేర్కొన్నారు.

మొత్తం 35 మంది మావోయిస్టులు మృతి చెందారని, అక్టోబర్ 4వ తేదీన జరిగిన ఎదురు కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందగా, 17 మందికి గాయాలయ్యాయని, ఐదో తేదీ ఉదయం భద్రత బలగాలు గాయపడ్డ మావోయిస్టులను విచక్షణారహితంగా కాల్చి చంపారని మావోలు ఆ లేఖలో ఆరోపించారు. భద్రతా బలగాలు పాల్పడిన నరసంహారం పై న్యాయ విచారణ చేపట్టాలని, అందుకు ప్రజాస్వామిక వాదులు డిమాండ్ చేయాలని లేఖలో కోరారు. కార్పొరేట్ శక్తులకు ఖనిజ సంపదను దోచిపెట్టడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విప్లవాన్ని అణిచివేస్తున్నాయని ఆరోపించారు. కార్పొరేట్ శక్తుల దోపిడీకి వ్యతిరేకంగా, ప్రజల విముక్తి గురించి పోరాడుతూ.. వీరమరణం పొందిన అమరవీరులకు సంతాపం తెలియజేశారు. అమరవీరుల ఆశయాలను, కలలను సాకారం చేయడానికి దృఢ సంకల్పంతో పనిచేయాలని మావోయిస్టులలో ధైర్యం నింపారు.

Advertisement

Next Story