జమిలి ఎన్నికలకు 81 శాతం మంది ఓకే.. ప్రజల నుంచి 21వేల సూచనలు

by Hajipasha |
జమిలి ఎన్నికలకు 81 శాతం మంది ఓకే..  ప్రజల నుంచి 21వేల సూచనలు
X

దిశ, నేషనల్ బ్యూరో : మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ కమిటీకి ఇటీవల సూచనలు చేసిన దేశ ప్రజల్లో 81 శాతం మంది జమిలి ఎన్నికలపై సానుకూలతే వ్యక్తం చేశారట. కమిటీకి ప్రజల నుంచి దాదాపు 21వేల సూచనలు అందాయని, వాటిలో 81 శాతం మంది జమిలి ఎన్నికల ఆలోచన సమంజసమైనదే అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారట. ఆదివారం జమిలి ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం ఈవివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ మీటింగ్‌లో గులాం నబీ ఆజాద్, న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి.కశ్యప్, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీ పాల్గొన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణ వ్యయం, అందుకోసం చేయాల్సిన రాజ్యాంగ సవరణలపై ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సూచనలపై కమిటీ భేటీలో చర్చించారు. జమిలి ఎన్నికల అంశంపై 46 రాజకీయ పార్టీల నుంచి సలహాలను ఆహ్వానించగా.. 17 పార్టీల నుంచే సూచనలు అందాయని కమిటీ వెల్లడించింది. కాంగ్రెస్, టీఎంసీ సహా వివిధ ప్రతిపక్షాలు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడాన్ని వ్యతిరేకించాయని పేర్కొంది. తదుపరిగా ప్రముఖ న్యాయనిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులు, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఫిక్కీ, అసోచామ్, సీఐఐ అధిపతులతోనూ కోవింద్ కమిటీ సంప్రదింపులు జరపనుంది. జనవరి 27న వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ మళ్లీ సమావేశం కానుంది. లా కమిషన్‌ అభిప్రాయాలపై పునస్సమీక్షించే అవకాశం ఉందట.

Advertisement

Next Story

Most Viewed