Kolkata doctors: మరికొన్ని డిమాండ్లు వినిపించేందుకు చర్చలు జరపాలి.. నిరసన కొనసాగిస్తామన్న వైద్యులు

by Shamantha N |
Kolkata doctors: మరికొన్ని డిమాండ్లు వినిపించేందుకు చర్చలు జరపాలి.. నిరసన కొనసాగిస్తామన్న వైద్యులు
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారంపై వైద్యులు ఇంకా నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. హెల్త్ సెక్రటరీని తొలగించడం సహా తమ డిమాండ్‌లన్నింటినీ నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని ప్రకటించారు. మరికొన్ని డిమాండ్లను వినిపించేందుకు దీదీ సర్కారుతో మరోసారి చర్చలు జరపాలని కోరారు. బుధవారం అర్ధరాత్రి ఒంటిగంటకు ముగిసిన ఐదు గంటల సుదీర్ఘ పాలకమండలి సమావేశం తర్వాత వైద్యులు ఈ విషయాన్ని ప్రకటించారు. ఆరోగ్య కార్యదర్శిని తొలగించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ఉదయం నుంచి బెంగాల్ స్వాస్థ్ భవన్ ఎదుట నిరసనలు కొనసాగిస్తున్నారు. ‘‘మా డిమాండ్లు పూర్తిగా నెరవేరేంతవరకు ఈ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి. కోల్‌కతా ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎన్‌ఎస్‌ నిగమ్‌ను విధుల నుంచి తొలగించాలి. అంతేకాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో సురక్షిత వాతావరణం కల్పించాలి. మరికొన్ని డిమాండ్లను వినిపించేందుకు సీఎంతో మరోసారి చర్చలు జరపాల్సిన అవసరం ఉంది’’ అని వైద్యులు తెలిపారు. సీఎం మమతాతో మరో సమావేశాన్ని ఏర్పాటుచేయాలని కోరుతూ సీఎస్ మనోజ్‌ పంత్‌కు మెయిల్‌ పంపినట్లు వెల్లడించారు. ఆస్పత్రి ప్రాంగణంలో వైద్యులకు కల్పించే భద్రతతో పాటు ప్రభుత్వం కేటాయించిన రూ.100 కోట్లను ఎలా ఖర్చు చేయాలనుకుంటున్నారనే అంశాలపై సమగ్రంగా చర్చించాలని పేర్కొన్నారు.

మూడు డిమాండ్లకు అంగీకారం

వైద్య విద్యార్థుల ఐదు డిమాండ్లలో మూడింటిని దీదీ అంగీకరించారు. కోల్‌కతా నగర పోలీసు కమిషనర్ వినీత్ గోయల్‌ను బదిలీ చేయడంతో సహా తమ డిమాండ్లలో మెజారిటీని ఆమోదించిందని మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ క్రమంలోనే నూతన కమిషనర్‌గా మనోజ్‌ కుమార్‌ వర్మను నియమిస్తూ దీదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. వైద్యుల డిమాండ్లను పరిష్కరించేందుకు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బెనర్జీ ప్రకటించారు. ఇకపోతే, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎన్ఎస్ నిగమ్ ను తొలగించాలని కూడా వైద్యులు ఒత్తిడి చేశారు. అయితే, ప్రభుత్వం మాత్రం అందుకు అంగీకరించలేదు. ఇకపోతే, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DHS) దేబాషిస్ హల్డర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) కౌస్తవ్ నాయక్, కోల్‌కతా పోలీస్ నార్త్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ అభిషేక్ గుప్తాలపైన కూడా వేటు పడింది.

Advertisement

Next Story

Most Viewed