పూణె యాక్సిడెంట్ కేసులో కీలక పరిణామం: ఇద్దరు డాక్టర్ల అరెస్టు

by samatah |
పూణె యాక్సిడెంట్ కేసులో కీలక పరిణామం: ఇద్దరు డాక్టర్ల అరెస్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: పూణె పోర్షే ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడి బ్లడ్ శాంపిల్స్ తారుమారు చేశారనే ఆరోపణలతో ఇద్దరు డాక్టర్లను పోలీసులు సోమవారం అరెస్టు చేసినట్టు కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. మైనర్ నిందితుడి తండ్రి విశాల్ అగర్వాల్ సూచన మేరకు రక్త నమూనాను మార్చేందుకు వైద్యులు కుట్ర పన్నినట్టు వెల్లడించారు. ప్రమాదం జరిగిన రోజు నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం సాసూన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నిందితుడైన మైనర్ మద్యం మత్తులో ఉన్నట్టు ఆరోపణలు వచ్చినా రిపోర్టులో మాత్రం మద్యం తాగి లేనట్టు వచ్చింది. అనంతరం అనుమానం వచ్చి మరొక ఆస్పత్రిలో పరీక్షించగా రక్తంలో మద్యం ఉన్నట్టు వెల్లడైంది.

అయితే డీఎన్ఏ టెస్ట్ తర్వాత రెండు శాంపిళ్లు వేర్వేరని తేలింది. ప్రమాదానికి గురైన నిందితుడి రక్త నమూనాలను మద్యం తాగని మరొక వ్యక్తితో మార్చినట్టు పోలీసులు తెలిపారు. అసలైన రక్త నమూనాను డస్ట్‌బిన్‌లో పారేసినట్టు వెల్లడించారు. నిందితుడిని రక్షించడానికి వైద్యులు సాక్ష్యాలను తారుమారు చేసినట్టు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు వైద్యులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 9కి చేరింది. కాగా, మద్యం మత్తులో ఉన్న ఓ మైనర్ బాలుడు లగ్జరీ పోర్షే కారుతో ఓ బైక్‌ను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు ఐటీ ఉద్యోగులు అక్కడికక్కడే మరణించారు. ఆ సమయంలో కారు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్నట్టు పోలీసులు గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed