- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Kerala: ‘వయనాడ్’ ఘటన.. 295కు చేరిన మరణాలు.. గవర్నర్ ఆరిఫ్ కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో : కేరళలోని వయనాడ్‌లో చోటుచేసుకున్న ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య గురువారం సాయంత్రం నాటికి మరింత పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 295 మంది చనిపోయారని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభావిత ప్రాంతాలకు చెందిన 240 మంది ఆచూకీ తెలియడం లేదని పేర్కొన్నాయి. క్లౌడ్ బరస్ట్‌తో కొండ చరియలు విరిగిపడి ఇరువైపుజ నది ఉధృతంగా ప్రవహించింది. దీంతో దాదాపు 8 కిలోమీటర్ల మేర ప్రాంతంలో భీతావహ పరిస్థితి ఏర్పడింది. ముండక్కై, చూరల్ మల, పోతుకలు, వెలారి మల, చూరల్ పారా సహా పలు ప్రభావిత గ్రామాలకు చెందిన ఎంతోమంది వరదలో కొట్టుకుపోయారు. ఇప్పుడు ఆచూకీ తెలియని వారంతా.. అలా వరదలో కొట్టుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. మరోవైపు ఆయా గ్రామాల్లో ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, స్టేట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. పొంగిపొర్లుతున్న నదులపై తాత్కాలిక వంతెనలను నిర్మించి బాధితులను ఆస్పత్రులను తరలించే ప్రక్రియను చేపడుతున్నారు. నిత్యావసరాలను గ్రామాల్లోకి చేరవేస్తున్నారు. గ్రామాల్లో పడిన కొండచరియలను, నేలమట్టమైన ఇళ్ల శిథిలాలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి. ‘‘వయనాడ్ జిల్లాకు క్లౌడ్ బరస్ట్ సూచన ఉందని వారం ముందే (జులై 23న) కేరళ ప్రభుత్వానికి అలర్ట్ పంపాం. అయినా పట్టించుకోకపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఖండించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడుతోందని ఆమె పేర్కొన్నారు. క్లౌడ్ బరస్ట్ గురించి కానీ, కొండచరియలు విరిగిపడతాయని కానీ ఎలాంటి అలర్ట్ తమకు అందలేదని స్పష్టం చేశారు.
82 రిలీఫ్ క్యాంపుల్లో 8వేల మందికి ఆశ్రయం : సీఎం విజయన్
వయనాడ్ విషాద ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ గురువారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రభావిత గ్రామాలకు చెందిన బాధితులకు తాత్కాలిక పునరావాసం కల్పించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని సీఎం వెల్లడించారు. ఆయా పల్లెల్లో రెస్క్యూ వర్క్స్ వేగవంతంగా జరగడానికి తాత్కాలిక వంతెనలను నిర్మించినట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాలకు చెందిన 8వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రదేశాలకు చేర్చామన్నారు. 82 రిలీఫ్ క్యాంపుల్లో వారంతా ఆశ్రయం పొందుతున్నారని విజయన్ చెప్పారు. ఆ క్యాంపుల వద్ద పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేస్తామని.. వాటిలో ఉంటున్న వారు మినహా ఎవరినీ లోపలికి అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. బాధిత కుటుంబాల వారిని ఎవరైనా కలవాలని భావిస్తే.. రిసెప్షన్‌కు పిలిచి మాట్లాడుకోవాల్సి ఉంటుందన్నారు. ‘‘ప్రస్తుతం 12 మంది రాష్ట్ర మంత్రులు వయనాడ్ జిల్లాలోనే ఉన్నారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు నలుగురు మంత్రులతో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం’’ అని సీఎం పినరయి విజయన్ వెల్లడించారు. ‘‘ఈ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేం కోరాం. ఇక స్పందించాల్సింది వాళ్లే’’ అని ఆయన చెప్పారు. ఇలాంటి ఘటనలపైనా కొందరు రాజకీయాలు చేయాలని భావిస్తున్నారంటూ సీఎం విస్మయం వ్యక్తం చేశారు.
ఆ గ్రామాన్ని రెస్క్యూ టీమ్స్ ఇంకా చేరుకోలేదు : కేరళ గవర్నర్
వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తెల్లవారుజామున మొట్టమొదట కొండచరియలు విరిగిపడిన ప్రదేశానికి ఇప్పటికీ రెస్క్యూ టీమ్స్ చేరుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. కొండచరియలు పడటంతో చలియార్ నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకొని.. పక్కనే ఉన్న ఓ కుగ్రామాన్ని ముంచేసిందని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విధంగా తుడిచి పెట్టుకుపోయిన గ్రామాన్ని ఇంకా రెస్క్యూ టీమ్స్ చేరుకోలేకపోవడం బాధాకరమని ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తెలిపారు. ‘‘ఆ కుగ్రామాన్ని చేరుకోవడానికి ఆర్మీ ఇంజినీరింగ్ విభాగం ఒక పోర్టబుల్ వంతెనను నిర్మించే ప్రయత్నాల్లో ఉంది. అది పూర్తయితేనే అక్కడికి రెస్క్యూ టీమ్స్ చేరుతాయి’’ అని గవర్నర్ వెల్లడించారు.