కేజ్రీవాల్‌ను చిత్ర హింసలకు గురి చేస్తున్నారు: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన ఆరోపణలు

by samatah |
కేజ్రీవాల్‌ను చిత్ర హింసలకు గురి చేస్తున్నారు: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ ఆదేశాల మేరకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను తిహార్ జైలులో చిత్ర హింసలకు గురిచేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. కేజ్రీవాల్‌ను ఆయన భార్య సునీత వ్యక్తిగతంగా కలిసేందుకు జైలు అధికారులు నిరాకరించారని తెలిపారు. కేజ్రీవాల్ హక్కులను హరిస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘జైలు లోపల కేజ్రీవాల్‌ను చిత్రహింసలు పెడుతున్నారు. ఆయన నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆయన భార్యను ముఖాముఖిగా కలుసుకోవడానికి కూడా అనుమతించడం లేదు’ అని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌ను భావోద్వేగంతో విచ్ఛిన్నం చేయాలని బీజేపీ కోరుకుంటున్నదని మండిపడ్డారు.

‘ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే పోరాటం జరుగుతోంది. కేజ్రీవాల్‌కు జైలు నిబంధనలకు లోబడి ఉన్న హక్కులను హరించవద్దని ప్రధాని మోడీని, హోంమంత్రి అమిత్‌షాను అభ్యర్థిస్తున్నా. నియంతగా ఉండటానికి ప్రయత్నించొద్దు. ఇది ప్రజాస్వామ్య దేశం’ అని సంజయ్ సింగ్ తెలిపారు. సునీతా కేజ్రీవాల్‌ను కిటికీలోంచి మాత్రమే కలవాలని జైలు అధికారులు చెప్పారని, కేజ్రీవాల్‌ను కించపరిచేందుకే ఇలా చేశారన్నారు. భయంకరమైన నేరస్థులను కూడా బ్యారక్‌లో కలవడానికి అనుమతిస్తారని, కానీ కేజ్రీవాల్ విషయంలో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సంజయ్ సింగ్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed