Delhi: ఎక్సైజ్ పాలసీలో కేజ్రీవాల్‌కు భాగస్వామ్యం.. సీబీఐ తుది ఛార్జిషీట్ దాఖలు

by Harish |
Delhi: ఎక్సైజ్ పాలసీలో కేజ్రీవాల్‌కు భాగస్వామ్యం.. సీబీఐ తుది ఛార్జిషీట్ దాఖలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ తన తుది ఛార్జిషీట్ దాఖలు చేసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ‘నేరపూరిత కుట్రలో భాగస్వామి’గా ఉన్నారని పేర్కొంది. ఎక్సైజ్ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి 'సౌత్ గ్రూప్' సుమారు రూ. 90-100 కోట్లు ఆప్‌కు చెల్లించిందని, వాటిలో 2022 గోవా ఎన్నికల కోసం రూ. 44.5 కోట్లను అక్రమంగా అక్కడికి పంపించారని ఛార్జిషీట్‌లో తెలిపింది. కేజ్రీవాల్ మార్చి 2021 నెలలో సహ నిందితుడు మనీష్ సిసోడియా నేతృత్వంలోని పాలసీని రూపొందిస్తున్నప్పుడు, ఆప్ పార్టీకి ప్రయోజనం చేకూరాలని ఆయన డిమాండ్‌ చేశారు. పాలసీ రూపకల్పన నుంచి దాన్ని అమలు చేయడం వరకు ఢిల్లీ కేజ్రీవాల్ ప్రమేయం ఉంది. ఢిల్లీ ఎమ్మెల్యే, ఆప్ ఇన్‌ఛార్జ్ దుర్గేష్ పాఠక్ పాత్ర కూడా దీనిలో ఉందని సీబీఐ ఛార్జిషీట్‌లో ఆరోపించింది.

ఆ డబ్బులను ఆప్ ఎన్నికల ప్రచారానికి వాడారని, మహాదేవ్ నారాయణ్ నాయక్, సత్యవిజయ్ నాయక్‌ను దుర్గేష్ పాఠక్ సంప్రదించి ఎన్నికల్లో వారి ప్రచారానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా పార్టీ చెల్లిస్తుందని తెలిపినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొంది. తమ విచారణలో భాగంగా ఆప్ అభ్యర్థులు చేసిన ప్రచారానికి చేసిన ఖర్చులన్నీ పార్టీ నగదు రూపంలో చెల్లించినట్లు తేలిందని సీబీఐ పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను ఆప్ ఖండించింది, ఇది పార్టీకి వ్యతిరేకంగా 'కుట్ర' అని పేర్కొంది. ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను అవినీతి కేసులో జూన్‌లో సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచి ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed