31న ‘ఇండియా’ సభ.. హాజరయ్యే అగ్రనేతలు వీరే

by Hajipasha |
31న ‘ఇండియా’ సభ.. హాజరయ్యే అగ్రనేతలు వీరే
X

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాం కేసులో ఆప్ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆదివారం ఉదయం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌ వేదికగా ఇండియా కూటమి భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. దాదాపు 20వేల మంది హాజరయ్యే అవకాశమున్న ఈ సభలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే, డెరెక్ ఓబ్రెయిన్ సహా పలువురు ప్రతిపక్ష పార్టీల ప్రముఖులు పాల్గొననున్నారు. ఈసభపై ఢిల్లీవ్యాప్తంగా కరపత్రాలతో ముమ్మర ప్రచారం నిర్వహించామని ఆప్ సీనియర్ నేత గోపాల్ రాయ్ వెల్లడించారు. సభకు ఆహ్వానం పలుకుతూ హస్తిన ప్రజలకు కరపత్రాలను అందజేశామన్నారు. ‘‘తానాషాహీ హటావో.. దేశ్ బచావో (నియంతృత్వాన్ని అంతం చేద్దాం.. దేశాన్ని రక్షిద్దాం) అనే థీమ్‌తో ఈ సభ జరుగుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరిస్తున్న రాజకీయ ప్రతీకార వైఖరి, ప్రతిపక్షాల గొంతును నొక్కుతున్న తీరును ప్రజలకు వివరించడమే ఈ సభ ప్రధాన లక్ష్యమని గోపాల్ రాయ్ చెప్పారు. జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌లను ఈడీ అరెస్టు చేయడం మన రాజ్యాంగంపై జరిగిన దాడేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పుడు ప్రధాని మనసులో ఒకే ఒక్క ఆలోచన ఉంది. ‘వన్ నేషన్.. నో ఎలక్షన్’.. దేశం మొత్తం కేవలం ఒకే వ్యక్తి పాలనలో మగ్గాలి అనేదే మోడీ స్వప్నం’’ అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed