లైంగిక వేధింపుల కేసులో బీజేపీ నేత యడ్యూరప్పకు సీఐడీ నోటీసులు

by S Gopi |   ( Updated:2024-06-12 15:42:26.0  )
లైంగిక వేధింపుల కేసులో బీజేపీ నేత యడ్యూరప్పకు సీఐడీ నోటీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీ ఎస్ యడ్యూరప్పకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. పోక్సో (లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ) కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని కర్ణాటక పోలీసు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) నోటీసులు ఇచ్చినట్టు అధికారులు వెల్లడించారు. మైనర్‌పై యడ్యూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఈ ఏడాది ప్రారంభంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయనపై పోక్సో చట్టం, భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 354(ఏ) కింద లైంగిక వేధింపుల కింద అభియోగాలు మోపబడింది. యడ్యూరప్ప తన న్యాయవాదుల ద్వారా, సీఐడీ ముందు హాజరు కావడానికి ఒక వారం గడువును కోరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కారణంగా అక్కడినుంచి వచ్చాక విచారణకు హాజరవుతారని ఆయన సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి. అయితే, యడ్యూరప్ప తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. అవి 'నిరాధారమైనవి' అన్నారు. చీటింగ్ కేసులో సహాయం కోసం యడియూరప్ప వద్దకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని బాలిక తల్లి ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. తన కుమార్తెను బీజేపీ నేత బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక హింసలు పాల్పడినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, కర్ణాటకకు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన యడియూరప్ప, పదవి నుంచి దిగిపోయిన తర్వాత నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆ పదవిని తన కుమారుడికి వరించగా, ఆయన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా కొనసాగుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed