Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లుపై ఈనెల 18 నుంచి 20 వరకు జేపీసీ భేటీ

by Hajipasha |
Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లుపై ఈనెల 18 నుంచి 20 వరకు జేపీసీ భేటీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘వక్ఫ్ సవరణ బిల్లు -2024’పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సెప్టెంబరు 18, 19, 20 తేదీల్లో ఢిల్లీలోని పార్లమెంటులో సమావేశం కానుంది. ఈవిషయాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది. ఈ ప్రకటన ప్రకారం.. వక్ఫ్ సవరణ బిల్లుపై మౌఖిక సాక్ష్యాలను ఈనెల 18న మైనారిటీ వ్యవహారాల శాాఖ ప్రతినిధులు రికార్డు చేయనున్నారు. జేపీసీ సమక్షంలో ఈప్రక్రియ జరుగుతుంది. ఈనెల 19న వక్ఫ్ సవరణ బిల్లుపై ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా, పస్మాందా ముస్లిం మహాజ్, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సహా పలువురు ముస్లిం ప్రతినిధులు జేపీసీ ఎదుట తమ వాణిని వినిపిస్తారు. ఈనెల 20న వక్ఫ్ సవరణ బిల్లుపై ఆలిండియా సజ్జాదా నషీన్ కౌన్సిల్ (అజ్మీర్), ముస్లిం రాష్ట్రీయ మంచ్, ఢిల్లీ అండ్ భారత్ ఫస్ట్ (ఢిల్లీ) సహా పలు సంఘాల ప్రతినిధులు జేపీసీ ఎదుట తమ అభిప్రాయాలను వినిపిస్తారు. చివరిసారిగా జేపీసీ ఈనెల 6న సమావేశమైంది.

బిల్లును పూర్తిగా చదివిన తర్వాతే వాణిని వినిపించాలి: ముస్లిం మేధావులు

వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చించేందుకు శుక్రవారం ఢిల్లీలో ముస్లిం సామాజిక వేత్తలు, మేధావులు సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఇస్లామిక్ స్కాలర్ ముఫ్తీ వజాహత్ ఖాస్మీ మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ బిల్లును పూర్తిగా చదివిన తర్వాతే దానిపై జేపీసీ ఎదుట వాణిని వినిపించాలని ముస్లిం ప్రతినిధులను ఆయన కోరారు. ఈ బిల్లు విషయంలో ప్రభుత్వం ఉద్దేశాలను అనుమానించాల్సిన అవసరం లేదని వజాహత్ ఖాస్మీ చెప్పారు. వక్ఫ్ భూముల నుంచి నిరుపేద ముస్లింలకు ఎలాంటి ప్రయోజనాలూ లభించడం లేదని ముస్లిం సామాజిక కార్యకర్త మహ్మద్ తాహిర్ ఇస్మాయిల్ తెలిపారు. వాటి ఫలాలను అందరికీ అందించాలని భావించడంలో తప్పేం లేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed