కీలక దశకు చేరుకున్న గగన్‌యాన్: ఇస్రో చైర్మన్

by Harish |
కీలక దశకు చేరుకున్న గగన్‌యాన్: ఇస్రో చైర్మన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ ఈ ఏడాది కీలక దశకు చేరుకుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ ప్రముఖ మీడియాతో అన్నారు. దీనిలో భాగంగా ముఖ్యమైన మూడు మిషన్‌లు కూడా షెడ్యూల్ చేసినట్లు ఆయన తెలిపారు. మొదటిది మానవరహిత మిషన్‌ను కక్ష్యలో చేర్చడం, దానిని సురక్షితంగా తిరిగి తీసుకురావడం, రెండవది పరికరాలు, అల్గోరిథాన్ని టెస్ట్ చేయడం, మూడవది లాంచ్ ప్యాడ్‌ను తనిఖీ చేయడం వంటి వాటిని ఈ ఏడాది పరీక్షిస్తామని చైర్మన్ పేర్కొన్నారు.

ప్రయోగ తేదీ గురించి ఆయన మాట్లాడుతూ, గగన్‌యాన్ మొదటి టెస్ట్ ఫ్లైట్ అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే ఏడాది చివరిలో షెడ్యూల్ చేయబడుతుంది. అయితే తదుపరి పురోగతిపై ఆధారపడి ఉంటుందని అన్నారు. మొదటి గగన్‌యాన్ సిబ్బందితో కూడిన విమానం అంతరిక్షంలో తిరుగుతూ, పర్యావరణ జీవనాధారం, నియంత్రణ వ్యవస్థలను సమర్థవంతంగా పరీక్షిస్తుందని చైర్మన్ సోమనాథ్ చెప్పారు. గగన్‌యాన్ మిషన్‌ కోసం గతంలో వైమానిక దళానికి చెందిన నలుగురు పైలట్లను ఎంపిక చేశారు. వారు.. ప్రశాంత్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, శుభాంశు శుక్లాలు. గగన్‌యాన్ మిషన్ కింద, ఇస్రో మూడు రోజుల వ్యవధిలో నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపి వారిని సురక్షితంగా తీసుకురావాలని యోచిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed