‘భారతరత్న’ వెనుక మోడీ అసలైన వ్యూహం అదేనా?

by Prasad Jukanti |
‘భారతరత్న’ వెనుక మోడీ అసలైన వ్యూహం అదేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈఏడాది బిహార్ మాజీ సీఎం, ప్రఖ్యాత సోషలిస్టు నాయకుడు కర్పూరి ఠాకూర్ కు భారతరత్న అవార్డును ప్రకటించిన మోడీ సర్కార్ తాజాగా రాజకీయ కురవృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్.కే అద్వానీకి సైతం ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వెల్లడించారు. దేశాభివృద్ధిలో అద్వాణీ పాత్ర కీలకమని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. అయితే ఎన్నికల ఏడాదిలో కర్పూరి ఠాకూర్, అద్వానీకి ఈ పురస్కారం లభించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడమే టార్గెట్ గా పెట్టుకున్న మోడీ.. వ్యూహాత్మకంగానే భారతరత్న పురస్కారాలపై నిర్ణయం తీసుకున్నారా? ఈ ఎఫెక్ట్ తో ప్రతిపక్షాలకు చెక్ పడబోతున్నదా? అనే చర్చ జోరందుకుంది. దక్షిణ భారత దేశం వైపు నుంచి అనేక మంది ప్రతిభావంతులు, అర్హులు ఉన్నారని వారి పేర్లను పరిశీలించాలని ప్రతిపాదనలు వెళ్తున్నా నరేంద్ర మోడీ సర్కార్ మాత్రం ఈ ఏడాది నార్త్ ఇండియన్ కు చెందిన వ్యక్తుల పేర్లనే ఈ పురస్కారానికి ఎంపిక చేయడం వెనుక మోడీ రాజకీయ వ్యూహాం ఏంటి అనేది చర్చనీయాశంగా మారింది.

అదును చూసి అస్త్రం:

అదును చూసి రాజకీయ వ్యవహారాలు నడిపించడంలో మోడీకి మించిన వారు లేరనే టాక్ ఉంది. టైమ్ పాలిటిక్స్ విషయంలో ఆయనా వ్యూహా రచన బీజేపీకి పెద్ద ప్లస్ పాయింట్ అనేది రాజకీయ వర్గాల్లో వినిపించే మాట. 2024 సార్వత్రిక ఎన్నికల వేళ సరిగ్గా మోడీ ఇటువంటి టైమ్ పాలిటిక్స్ కు ప్రయార్టీ ఇస్తున్నారనే చర్చ జోరుగా జరుగుతోంది. బిహార్ కు చెందిన దివంగత సీఎం కర్పూరి ఠాకూర్ కు, ఎల్ కే అద్వానీకి భారత రత్న ఇవ్వడం వెనుక మోడీ ఇదే వ్యూహాం అనుసరించారనే ప్రచారం వినిపిస్తోంది. ఈ అవార్డును అందుకోవడానికి వీరిద్దరు అర్హులై అయినప్పటికీ వీరికి అవార్డులు దక్కిన సందర్భాన్ని పరిశీలిస్తే మోడీ టైమ్ పాలిటిక్స్ కు తెర లేపారనే వాదన వినిపిస్తోంది.

ప్రతిపక్షాలకు చెక్:

నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ కులగణన అంశంతో ఎటాక్ చేస్తోంది. తాము అధికారంలోకి రాగానే కులగణన చేపడుతామని హామీ ఇస్తోంది. ఈ క్రమంలో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సమయంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ కులగణను చేపట్టారు. ఇంతలో నితీశ్ కుమార్ తిరిగి ఎన్డీయేకు చేరారు. అయితే ఈ చేరికకు రోజుల ముందు బిహార్ లో వెనుకబడిన వర్గాల కోసం కృషి చేసిన దివంగత సీఎం కర్పూరి ఠాకూర్ మోడీ ప్రభుత్వం భారత రత్నను ప్రకటించింది. ఈ వ్యవహారంపై చర్చ జరుగుతుండగానే ఇంతలో అద్వానీకి సైతం భారతరత్న ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరిగింది. ఈ ఎఫెక్ట్ తో మరోసారి బీజేపీ పక్కా అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమానికి పురుడు పోసిన అద్వానికి భారతరత్నతో గౌరవించడం ద్వారా హిందూ ఓటర్లను పార్టీ వైపు పూర్తి స్థాయిలో మళ్లించేందుకు మోడీ వ్యూహా రచనలో భాగంగానే అద్వానీని ఈ సమయంలో అవార్డు ప్రకటించారా అనే చర్చ తెరమీదకు వస్తోంది. అయితే ఎన్టీఆర్, పీవీ నరసింహారావు వంటి దక్షిణాదికి చెందిన మరెందరో ప్రముఖులకు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. కానీ మోడీ మాత్రం తనదైన నిర్ణయాలతో దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఎన్నికల్లో ఈ ప్రభావం ఎలా ఉండబోతున్నది అనేది ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story

Most Viewed