Manipur: మణిపూర్‌లో 5 రోజుల పాటు ఇంటర్నెట్‌ బంద్

by Harish |
Manipur: మణిపూర్‌లో 5 రోజుల పాటు ఇంటర్నెట్‌ బంద్
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. తాజా అల్లర్లను దృష్టిలో ఉంచుకుని కొంతమంది సామాజిక మాధ్యమాల ద్వారా ద్వేషపూరిత ప్రసంగాలు, ఫొటోలు, తప్పుడు సమాచారాన్ని షేర్ చేసి హింసను తిరిగి రెచ్చగొట్టచ్చనే కారణంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలో సెప్టెంబర్ 10 మధ్యాహ్నం 3 గంటల నుండి సెప్టెంబర్ 15 మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తంగా ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిషేధించారు. లీజు లైన్‌లు, VSATలు, బ్రాడ్‌బ్యాండ్‌లు, VPN సేవలతో సహా ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలపై తాత్కాలిక సస్పెన్షన్‌‌ విధించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

కుకీ-మైతేయి వర్గాల మధ్య ఘర్షణలతో గతేడాది అట్టుడికిన మణిపూర్‌లో రెండు రోజుల క్రితం అల్లర్లు చెలరేగాయి. సోమవారం రాష్ట్ర రాజధాని ఇంఫాల్, పరిసర లోయలో విద్యార్థుల నేతృత్వంలో నిరసనలు జరగడంతో పోలీసులు మంగళవారం కర్ఫ్యూ విధించారు. ప్రభుత్వ/ప్రైవేట్ ఆస్తులకు ఎటువంటి ప్రాణ నష్టం లేదా ప్రమాదం జరగకుండా నిరోధించడానికి, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తప్పుడు సమాచారం, తప్పుడు పుకార్ల వ్యాప్తిని ఆపడం కోసం ప్రజా ప్రయోజనాల కింద ఈ కొత్త ఆదేశాలను జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed