- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవభూమి పీఠం ఎవరికో.. ఆసక్తికరంగా ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు
డెహ్రాడూన్: హరిద్వార్, రిషికేశ్, భద్రీనాథ్, కేదర్‌నాథ్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలతో దేవభూమిగా ప్రసిద్ధిగాంచిన ఉత్తరాఖండ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 14న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే, ఉత్తర ప్రదేశ్ నుంచి 2000 సంవత్సరంలో విడిపోయి, 27వ రాష్ట్రంగా అవతరించిన ఉత్తరాఖండ్‌లో ఇప్పటివరకు ఏ పార్టీ వరుసగా రెండోసారి అధికారం దక్కించుకోకపోడం గమనార్హం.
ఈ రాష్ట్రానికి ఇప్పటివరకు 4సార్లు(మధ్యంతర ప్రభుత్వం కాకుండా) అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా, 2002లో కాంగ్రెస్, 2007లో బీజేపీ, 2012లో మళ్లీ కాంగ్రెస్, 2017లో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. మరికొన్ని రోజుల్లో జరగబోయే ఐదో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సెంటిమెంట్ రిపీట్ అయితే, కాంగ్రెస్‌కు కలిసివస్తుంది. బ్రేక్ అయితే, ఉత్తరాఖండ్‌లో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీగా బీజేపీ నిలుస్తుంది. దీంతో ఈసారి పోరు ఆసక్తికరంగా మారింది.
జోరుమీదున్న బీజేపీ
గత ఎన్నికల్లో 70 స్థానాలకు ఏకంగా 57 సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించిన బీజేపీ ఈ ఎన్నికల్లో గెలుపుపై దీమా తో ఉంది. పైగా, బీజేపీ అగ్ర నాయకత్వం ప్రచారం కలిసిరానుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కంటే వారం రోజుల ముందే ప్రధాని మోడీ ఉత్తరాఖండ్‌లో పర్యటించారు. రూ.17,500 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 23 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. పైగా, గణతంత్ర దినోత్సవం రోజున ఉత్తరాఖండ్ సంస్కృతిని తెలిపేలా టోపీ పై రాష్ట్ర పుష్పం బ్రహ్మకమళాన్ని ధరించారు. మరోవైపు, అమిత్ షా సైతం రుద్రప్రయాగ్ జిల్లాలో శుక్రవారం ఇంటింటి క్యాంపెయిన్ నిర్వహించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పాలనలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని ఆరోపించిన ఆయన.. ఐదేళ్లపాటు మంచి పాలన అందించే పార్టీ ని ఎన్నుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
ఇలా వరుస క్యాంపెయిన్లతో రాష్ట్రంలో బీజేపీ జోరుమీదుంది. ఇప్పటికే 59 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ.. అన్ని వర్గాల వారికి సమాన ప్రాధాన్యం మిచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర జనాభాలో థాకూర్ కమ్యూనిటీ 35 శాతం, 25 శాతం మంది బ్రాహ్మణులు ఉన్నట్లు అంచనా. దీని ప్రకారం, 22 స్థానాలు థాకూర్లకు, 15 సీట్లు బ్రాహ్మిన్స్‌కు, 3 బనియా వర్గానికి కేటాయించారు. వీరిలోనూ ఎక్కువగా సిట్టింగ్ అభ్యర్థులే ఉండటం గమనార్హం. అయితే, ఐదేళ్లలోనే ముగ్గురు సీఎంలు మారడం, చివరి వరకు స్థిరమైన ప్రభుత్వాన్ని నడపక పోవడం ప్రతికూలాంశాలు గా కనిపిస్తున్నాయి.
కలహాలతో కాంగ్రెస్
ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కలహాలు ఇబ్బందికరంగా మారాయి. ఇప్పటికే పార్టీ రెండు విడుతలుగా అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక రెండో విడత జాబితాలో మాజీ సీఎం హరీష్ రావత్‌కు లాల్క్వాన్ స్థానం నుంచి టిక్కెట్టు కేటాయించారు. శుక్రవారం ఆయన నామినేషన్ దాఖలు చేయడం విశేషం. గత నెలలో హరీష్ రావత్ సామర్ధ్యంపై వరుస ట్వీట్ల కలకలం తర్వాత, కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించింది. ఈ తరుణంలో హారక్ సింగ్ రావత్ పార్టీలోకి చేరకుండా అడ్డుపడుతున్నాడనే ఆరోపణలు కూడా వచ్చాయి. ముఖ్యంగా హరీష్ రావత్ కు ప్రీతం సింగ్, రంజిత్ రావత్, గణేష్ గోధియాల్, హారక్ సింగ్ రావత్ ల మధ్య ఇప్పటికే వర్గపోరు నడుస్తోంది. గతంలో మంచి మిత్రులుగా ఉన్న రంజిత్ రావత్, హరీష్ రావత్‌లకు ప్రస్తుతం వైరం కొనసాగుతున్నది.
మరోవైపు ఒక కుటుంబం- ఒకే సీటు సూత్రాన్ని పాటిస్తున్న కాంగ్రెస్ పార్టీ హారీష్ రావత్ కూతురు అనుపమ రావత్‌కు హరిద్వార్ స్థానాన్ని కేటాయించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక 2014లో సీఎం హరీష్ రావత్ సీఎం బాధ్యతలు స్వీకరించిన రెండేళ్లకు విజయ్ బహుగుణ తిరుగుబాటు చేశారు. అయితే, బలపరీక్షలో నెగ్గి రావత్ తిరిగి అధికారంలో వచ్చినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమి చవిచూసింది. కాషాయ పార్టీ 57 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 11 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత అంతర్గత కలహాలు కూడా పార్టీకి నష్టం చేస్తాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రేసులోకి ఆప్..
ఇప్పటివరకు ఉత్తరాఖండ్‌లో జరిగిన ఎన్నికలన్నింటోనూ ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్‌కే ఉండగా, ఈసారి వీటి మధ్యలోకి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వచ్చింది. కాంగ్రెస్, బీజేపీ కి ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటున్న కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్.. ఇప్పటికే ఆరు దఫాలుగా మొత్తం 70 మంది అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ సీఎం అభ్యర్థిగా మాజీ సైనికాధికారి కల్నల్ అజయ్ కొతియాల్‌ను ప్రకటించి ఓటర్ల దృష్టిని ఆకర్షించారు. కొత్త మొహాన్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం, అజయ్‌కు రాజకీయ నేపథ్యం లేకపోవడం, రాష్ట్రంలో సైనిక కుటుంబాలు ఉండటం వంటి ఫ్యాక్టర్స్ ఆప్‌కు కలిసివస్తాయనే విశ్వాసంతో కేజ్రీవాల్ ఉన్నారు. మరోవైపు, ఎస్పీ సైతం బరిలోకి దిగుతోంది. రాష్ట్రంలో 60 స్థానాలు గెలుస్తామని పార్టీ చీఫ్ అఖిలేశ్ చెబుతున్నారు.