ఇజ్రాయెల్‌కు షాక్.. భారత పోర్ట్ వర్కర్స్ యూనియన్ కీలక నిర్ణయం

by Hajipasha |
ఇజ్రాయెల్‌కు షాక్.. భారత పోర్ట్ వర్కర్స్ యూనియన్ కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో : గత నాలుగు నెలలుగా ఇజ్రాయెల్ - గాజా మధ్య జరుగుతున్న భీకర యుద్ధంపై భారత్‌లోనూ రియాక్షన్ మొదలైంది. గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన పాశవిక దాడుల్లో ఇప్పటివరకు 28వేల మంది సామాన్య పాలస్తీనా పౌరులు చనిపోయారు. ఈనేపథ్యంలో భారత ఓడరేవుల నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్లే ఓడల్లోకి సైనిక సామగ్రి, ఆయుధాలను లోడింగ్, అన్ లోడింగ్ చేయలేమని వాటర్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. తమ సమాఖ్యలో సభ్యత్వం కలిగిన వారందరికీ ఈవిషయాన్ని తెలియజేశామని వెల్లడించింది. ఇజ్రాయెల్ - గాజా యుద్ధంలో అమాయకులైన పిల్లలు, మహిళలు, ముసలివారు చనిపోతుండటాన్ని చూసి చలించిపోయి ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని వాటర్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. గాజా యుద్ధం ముగిసే వరకు ఆయుధ కార్గోల నిర్వహణ పనులను తాము చేపట్టబోమని తేల్చి చెప్పింది. గాజా - ఇజ్రాయెల్ యుద్ధంలో తక్షణ కాల్పుల విరమణ అవసరమని సంఘం తెలిపింది. బాధ్యతాయుతమైన కార్మిక సంఘంగా తాము శాంతి సందేశాన్ని ఇస్తున్నామని స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా, స్పెయిన్, బెల్జియం సహా పలు దేశాలలోని పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్లు కూడా ఇటీవల ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇదే విధమైన నిర్ణయాన్ని ప్రకటించాయి.

Advertisement

Next Story