మోడీ హయంలో వచ్చే 10 ఏళ్లలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్: అమిత్ షా

by Harish |
మోడీ హయంలో వచ్చే 10 ఏళ్లలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్: అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత వచ్చే 10 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక మీడియా ఇంటర్వ్యూలో అన్నారు. 2014 నుంచి 2024 మధ్య కాలంలో మోడీ దేశ ఆర్థిక వ్యవస్థకు స్పష్టమైన మార్గాన్ని వేశారు. పాలసీ ద్రవ్యోల్బణం/బడ్జెట్ నష్టాలు/ మౌలిక సదుపాయాల ఖర్చులు, PSU బ్యాలెన్స్ షీట్లు, షేర్ మార్కెట్ పరిస్థితి మొదలగు వాటిని మేము మా పరిపాలన కాలంలో సరైన మార్గంలో ఉంచాము. మేము అధికారం చేపట్టక ముందు డీమ్యాట్ ఖాతాల సంఖ్య 2.20 కోట్లుగా ఉండగా, ఇప్పుడు అది 15 కోట్లకు చేరుకుంది. భారత్‌ను తయారీ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం అనేక విధానాలను రూపొందించిందని షా చెప్పారు.

గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రికల్ వాహనాలు, ఇథనాల్ ఉత్పత్తి వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా మార్చడానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఈ రంగాలు రాబోయే 25 ఏళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తాయి. తద్వారా భారతదేశం అగ్రగామిగా నిలుస్తుంది. వాటి ప్రయోజనాలను 25 సంవత్సరాల పాటు పొందుతాము. సెమీకండక్టర్ (తయారీ), రక్షణ ఉత్పత్తి, అంతరిక్ష సాంకేతికత, స్టార్టప్‌లకు గణనీయమైన ప్రోత్సహాలను అందించాం. బీజేపీ ప్రభుత్వం జీడీపీకి హ్యూమన్ టచ్ ఇచ్చిందని హోంమంత్రి అన్నారు.

14 కోట్ల మరుగుదొడ్లు నిర్మిస్తే, 14 కోట్ల కుటుంబాలు గౌరవంగా జీవిస్తాయి. 10 కోట్ల కుటుంబాలు వంట గ్యాస్ కనెక్షన్ పొందినప్పుడు, 50 కోట్ల మంది ప్రజలు పొగ రహిత, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. మంచి నీటి సరఫరా ద్వారా ఫ్లోరైడ్‌ను తగ్గించవచ్చు. తద్వారా ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఆయన అన్నారు. ఇంకా మంత్రి మాట్లాడుతూ, పోషకాహార లోపంపై పోరాడటానికి ప్రతి ఇంటికి 5 కిలోల రేషన్ అందించాం, ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా ఇచ్చాం, 4 కోట్ల గృహాలను నిర్మించాము, ఇంకా కొత్తగా 3 కోట్ల గృహాలను నిర్మించబోతున్నాము. కాబట్టి, భారతదేశాన్ని తయారీ కేంద్రంగా మార్చడంతో పాటు, ప్రజల కొనుగోలు శక్తిని అభివృద్ధి చేయడానికి అనేక చర్యలను మోడీ ప్రభుత్వం తీసుకుంటున్నట్లు అమిత్‌షా చెప్పారు.

యూపీఏ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా ఉండగా, మాజీ ప్రధాని అటల్ జీ దానిని 11వ స్థానంలో ఉంచారు. మన్మోహన్ సింగ్ దానిని 11వ స్థానంలోనే ఉంచారు, ఇప్పుడు మోడీ 11 నుండి 5 స్థానానికి తీసుకెళ్ళారు, మూడవసారి మోడీ హయాంలో దేశం మూడో స్థానానికి చేరుకుంటుందని షా అన్నారు.

Advertisement

Next Story