భారత్, పాక్ అణ్వాయుధ కేంద్రాలపై ..కీలక అప్‌డేట్

by Hajipasha |   ( Updated:2024-01-01 12:04:32.0  )
భారత్, పాక్ అణ్వాయుధ కేంద్రాలపై ..కీలక అప్‌డేట్
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత్, పాకిస్తాన్‌లు తమ అణ్వస్త్ర కేంద్రాల జాబితాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. అణ్వస్త్ర తయారీ కేంద్రాలు, నిల్వ కేంద్రాలపై దాడిని నిషేధిస్తూ 1991లో ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం అమలులో భాగంగా ఈ జాబితాలను ఇరుదేశాలు బదిలీ చేసుకున్నాయి. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌‌లలోని దౌత్య కార్యాలయాల ద్వారా సోమవారం ఈ జాబితాల మార్పిడి జరిగిందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ అంశంపై ఇరు దేశాలు జాబితాలను మార్పిడి చేసుకోవడం ఇది 33వ సారి. అణ్వస్త్ర తయారీ కేంద్రాలు, నిల్వ కేంద్రాల వివరాల జాబితాను తొలిసారి 1992 జనవరి 1న భారత్, పాక్‌లు ఇచ్చిపుచ్చుకున్నాయి.

ఇమ్రాన్ ఖాన్‌కు షాక్

పాకిస్తాన్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో పోటీ చేయాలని భావించిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలలో ఆయన పోటీ చేయకుండా పాక్ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది. లాహోర్‌ (ఎన్‌ఏ- 122), మియావలీ (ఎన్‌ఏ- 89) స్థానాల నుంచి ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను పాక్ ఎన్నికల సంఘం తిరస్కరించింది.అవినీతి కేసులో ఇమ్రాన్‌క జైలుశిక్ష పడినందున ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. ఇమ్రాన్ ఖాన్ రాజకీయ పార్టీ పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) కీలక నేతలు మహమూద్ ఖురేషి, హమ్మద్ అజర్‌ల నామినేషన్లు కూడా చెల్లవని ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఈసీ నిర్ణయంపై జనవరి 3 లోగా అప్పీల్ చేసుకునే సౌలభ్యం ఉంది. అప్పీల్ చేసుకుంటే జనవరి 10లోగా అప్పిలేట్ ట్రైబ్యునల్ నిర్ణయం తీసుకుంటుంది.

Advertisement

Next Story

Most Viewed