యూఎన్ పోస్ట్‌పై ఇజ్రాయెల్ దాడులు.. భారత్ అభ్యంతరం

by Mahesh Kanagandla |
యూఎన్ పోస్ట్‌పై ఇజ్రాయెల్ దాడులు.. భారత్ అభ్యంతరం
X

దిశ, నేషనల్ బ్యూరో: హిజ్బుల్లాను టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌లో దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో ఐరాస శాంతి పరిరక్షకులు గాయపడ్డారు. యూఎన్ పీస్‌కీపింగ్ మిషన్‌లో భాగంగా 600 మంది భారత జవాన్లు లెబనాన్‌లో ఉన్నారు. ఇజ్రాయెల్-లెబనాన్ బార్డర్.. 120 కిలోమీటర్ల బ్లూ లైన్‌ సమీపంలో యూఎన్ పీస్‌కీపర్లు ఉన్నారు. ఇజ్రాయెల్ దాడిలో ఈ యూఎన్ పోస్టు కూడా గాయపడింది. ఇందులో ఇద్దరు శాంతి పరిరక్షకులు గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందిస్తూ ఇజ్రాయెల్‌ తీరును భారత్ తప్పుపట్టింది.

బ్లూ లైన్ పొడవునా శాంతి భద్రతలు దారుణంగా క్షీణించడంపై భారత్ ఆందోళనను వ్యక్తపరిచింది. ఇక్కడి పరిస్థితులను తాము పరిశీలిస్తున్నామని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఐరాసకు చెందిన ప్రెమిసెస్‌ను అన్ని దేశాలు గౌరవించాలని వివరించింది. యూఎన్ శాంతి పరిరక్షకుల భద్రతను, ఐరాస గౌరవాన్ని కాపాడాలని పేర్కొంది. నఖోరాలోని ఐరాస హెడ్‌క్వార్టర్‌, ఇతర టార్గెట్లపై ఇజ్రాయెల్ బలగాలు మళ్లీ మళ్లీ దాడులు చేశారని యూఎన్ గురువారం ఓ ప్రకటన చేసింది. నఖోరాలోని యూఎన్ఐఎఫ్ఐఎల్ హెడ్‌క్వార్టర్‌లోని టవర్‌పై ఐడీఎఫ్‌ మెర్కెవా ట్యాంక్ బాంబుల దాడికి పాల్పడిందని యూఎన్ పేర్కొంది.

యూఎన్‌ శాంతి పరిరక్షణ కార్యాలయంపై ఇజ్రాయెల్‌ దళాలు కాల్పులు జరపడాన్ని ఇటలీ రక్షణమంత్రి గైడో క్రోసెట్టో ఖండించారు. దీన్ని యుద్ధనేరంగా పరిగణిస్తామన్నారు. స్పెయిన్ దీనిని "అంతర్జాతీయ చట్టాల తీవ్ర ఉల్లంఘన" అని పేర్కొంది. వాషింగ్టన్‌ ఈ దాడులపై స్పందిస్తూ.. హెజ్‌బొల్లా సౌకర్యాలను లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేస్తున్నదని, ఆ సమయంలో యూఎన్‌ శాంతి పరిరక్షకుల భద్రతకు ముప్పు వాటిల్లకుండా ఉండటం కష్టమని పేర్కొంది. ఇదిలా ఉండగా, యూఎన్‌ పరిరక్షకులు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని యూఎన్‌ తమ పీస్ కీపర్లకు సూచించింది.

Advertisement

Next Story