Independence Day: దేశానికి ‘సెక్యులర్’ సివిల్ కోడ్ అవసరం

by Shamantha N |   ( Updated:2024-08-15 07:35:29.0  )
Independence Day: దేశానికి ‘సెక్యులర్’ సివిల్ కోడ్ అవసరం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశానికి ‘సెక్యులర్’ సివిల్ కోడ్ అవసరమని ప్రధాని మోడీ అన్నారు. యూనిఫాం సివిల్ కోడ్‌పై చర్చలు జరగాలని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి మోడీ మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న సివిల్ కోడ్ మతపరమైనదిగా కనిపిస్తోందని.. కానీ, దేశానికి ‘సెక్యులర్’ సివిల్ కోడ్ అవసరమని అన్నారు. దీంతో, మత వివక్ష అంతమవుతోందన్నారు. యూనిఫాం సివిల్ కోడ్‌పై సుప్రీంకోర్టు పదే పదే చర్చలు జరిపి, పలుమార్లు ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తుచేశారు. పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో జరిగిన ఆందోళనలు అర్థం చేసుకోగలనని అన్నారు. అక్కడి హిందువులు, మైనారిటీల భద్రత కోసం 140 కోట్ల మంది భారతీయులు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ శ్రేయస్సునే భారత్ ఎప్పుడూ కోరుకుంటుందన్నారు. బంగ్లాదేశ్ లో శాంతిస్థాపనకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌ 'వికాస్ యాత్ర'లో పాలుపంచుకుంటామని పేర్కొన్నారు.

ప్రకృతి వైపరీత్యాలు

గత కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యం కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. అనేక మంది ప్రజలు తమ కుటుంబ సభ్యులను, ఆస్తిని కోల్పోయారని పేర్కొన్నారు. దేశం కూడా నష్టపోయిందన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన వారందరికీ సానుభూతి ప్రకటించారు. ఈ సంక్షోభ సమయంలో దేశం వారందరికీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కరోనా కాలాన్ని మనం ఎలా మర్చిపోగలం? అని గుర్తుచేశారు. భారత్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి అందరికంటే వేగంగా వ్యాక్సిన్లు అందించామన్నారు. ఉగ్రవాదులపై పోరాటం చేసేందుకు సాయుధ బలగాల సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు చేస్తున్నప్పుడు దేశ యువత గర్వంతో నిడిపోయిందన్నారు.

వోకల్ ఫర్ లోకల్

స్వాతంత్య్రం కోసం అప్పట్లో 40 కోట్ల మంది ప్రజలు పోరాడారని మోడీ గుర్తుచేశారు. భారతదేశ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని అన్నారు. భారత్‌ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలని అన్నారు. తయారీ రంగంలో గ్లోబల్‌ హబ్‌గా మార్చాలన్నారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ మనందరి లక్ష్యం. యువత తలచుకుంటే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు. ‘వికసిత్‌ భారత్‌ 2047’ నినాదం.. 140 కోట్ల మంది కలల తీర్మానం అని నొక్కి చెప్పారు. 'వోకల్ ఫర్ లోకల్' కోసం ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. ఆర్థిక వ్యవస్థకు ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదం ఊతమిచ్చింది. దేశీయ ఉత్పత్తులపై అందరూ గర్వపడుతున్నారని మోడీ అన్నారు. అంతరిక్షంలో భారత్‌ స్పేస్‌ స్టేషన్‌ త్వరలో సాకారం కావాలని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed