ఎగ్జిట్ పోల్స్‌పై ‘ఇండియా’ భగ్గు.. విమర్శనాస్త్రాలు ఇవీ

by Hajipasha |
ఎగ్జిట్ పోల్స్‌పై ‘ఇండియా’ భగ్గు.. విమర్శనాస్త్రాలు ఇవీ
X

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై విపక్ష ఇండియా కూటమి భగ్గుమంది. బీజేపీకి వంతపాడటమే లక్ష్యంగా, ఏకపక్షంగా ఆ ఫలితాలు ఉన్నాయని కూటమిలోని పార్టీలు పేర్కొన్నాయి. అవి ఎగ్జిట్ పోల్స్ కావని..మోడీ పోల్స్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. అవి ఎగ్జిట్ పోల్స్ కాదని.. మోడీ పోల్స్ అని ఆయన అభివర్ణించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించబోతోందని, 295 సీట్లకుపైగా గెలుచుకోబోతోందని చెప్పారు. జూన్ 4న జరగనున్న ఇండియా కూటమి పార్టీల సమావేశ ఎజెండాపై చర్చించేందుకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ నేతల్లో నిరాశ..

ఎగ్జిట్ పోల్స్ కొన్ని నెలల ముందే సిద్ధం చేశారని, ఇప్పుడు టీవీ చానెల్‌లలో మాత్రమే చూపబడుతున్నారని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శించారు. ఎగ్జిట్ పోల్స్‌ను ఉపయోగించి సోమవారం ప్రారంభమయ్యే షేర్ మార్కెట్ నుంచి బీజేపీ లబ్ధి పొందాలని కోరుకుంటోందని, బీజేపీ నాయకులు నిరాశ చెందినట్టు వారి ముఖాల్లో స్పష్టంగా కనపడుతోందన్నారు. కౌంటింగ్ రోజు ఈవీఎంలను నిశితంగా పరిశీలించాలని, ఎస్పీ అభ్యర్థులు, వారి పోలింగ్ ఏజెంట్లకు పిలుపునిచ్చారు. ‘ఎగ్జిట్ పోల్ కాలక్రమాన్ని అర్థం చేసుకోండి. బీజేపీ అనుకూల మీడియా బీజేపీకి 300 సీట్లు దాటాయి చెబుతోంది. దీని ద్వారా మోసాలకు పాల్పడే అకాశం ఉంది’ అని తెలిపారు.

ఎవరు డబ్బులిస్తే వారికి అనుకూలంగా..

శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మండిపడ్డారు. దీనిని ‘కార్పొరేట్ గేమ్’గా అభివర్ణించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎగ్జిట్ పోల్ అంచనాలు కార్పొరేట్ గేమ్. వారికి ఎవరు డబ్బులిస్తే వారికి అనుకూలంగా గణాంకాలను విడుదల చేస్తారు. అధికారంలోకి వచ్చి డబ్బు ఉంటే, ఎగ్జిట్ పోల్స్ ద్వారా సొంత లెక్కలు విడుదల చేయొచ్చు. ఇండియా 295 నుంచి 310 సీట్ల మధ్య గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్స్ ఎంతో మోసపూరితమైనవని ఆయన మండిపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ సంస్థల యజమానులందరూ ఒత్తిడిలో ఉన్నారని ఆయన ఆరోపించారు. హోం మంత్రి అమిత్ షా 150 మంది కలెక్టర్లను పిలిచి హెచ్చరించారని, బెదిరింపులకు పాల్పడి ఎన్నికల్లో గెలవలేరని తేల్చి చెప్పారు. మహారాష్ట్రలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. గత 10 ఏళ్లుగా ఎగ్జిట్ పోల్ గణాంకాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని సంజయ్ రౌత్ చెప్పారు. మహావికాస్ అఘాడీ కూటమికి మహారాష్ట్రలో 35 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు.

Advertisement

Next Story