‘హిమాచల్’ తిరుగుబాటు వెనుక.. పంజాబ్ ‘కెప్టెన్’!?

by Hajipasha |   ( Updated:2024-02-29 12:11:13.0  )
‘హిమాచల్’ తిరుగుబాటు వెనుక.. పంజాబ్ ‘కెప్టెన్’!?
X

దిశ, నేషనల్ బ్యూరో : హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్ సర్కారు ఎట్టకేలకు సంక్షోభ వలయం నుంచి గట్టెక్కింది. ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఈ సంక్షోభం వెనుక అన్నీ తానై పావులు కదిపిన ఒక కీలక నేత పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఆయనకు హిమాచల్‌ప్రదేశ్‌తో అస్సలు సంబంధం లేదు. అయినప్పటికీ వేరే రాష్ట్రం నుంచి చాకచక్యంగా పావులు కదిపి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయించడంలో బీజేపీ నాయకత్వానికి సహకారాన్ని అందించారట. ఇంతకీ ఆ నేత ఎవరో చెప్పుకోండి ? మాజీ కాంగ్రెస్ నేత, ప్రస్తుత బీజేపీ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్. ఇంతకీ పంజాబ్ మాజీ సీఎం అమరీందర్‌కు హిమాచల్ ప్రదేశ్‌తో లింక్ ఎలా ఏర్పడింది ? అనేది తెలుసుకోవాలంటే ఈ కథనం మొత్తం చదవాల్సిందే.

పాటియాలా రాజ కుటుంబం..

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు పాటియాలా రాజకుటుంబంతో బంధుత్వం ఉంది. హిమాచల్ కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడి, రాజీనామా చేస్తానన్న మంత్రి విక్రమాదిత్య సింగ్‌తో అమరీందర్‌కు బంధుత్వం ఉంది. హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడే ఈ విక్రమాదిత్య సింగ్‌. వీరభద్ర సింగ్ ఐదుగురు కుమార్తెలలో ఒకరు కెప్టెన్ అమరీందర్ సింగ్ మనవడిని వివాహం చేసుకున్నారు.కెప్టెన్ అమరీందర్ సింగ్ కుమార్తె జై ఇందర్ కౌర్ కుమారుడు అంగద్ సింగ్‌ను వీరభద్ర సింగ్ కుమార్తె అపరాజిత సింగ్ పెళ్లి చేసుకున్నారు.

అయోధ్య రామమందిర కార్యక్రమం రోజు నుంచి..

అయోధ్య రామమందిర కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండిపోయింది. అయినప్పటికీ హిమాచల్ మంత్రి విక్రమాదిత్య సింగ్‌ జనవరి 22న అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపనోత్సవానికి హాజరయ్యారు. అప్పుడే విక్రమాదిత్య సింగ్‌‌తో చర్చలు జరిపేందుకు కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను బీజేపీ రంగంలోకి దింపిందని అంటున్నారు. విక్రమాదిత్య సింగ్ సహకారంతో కాంగ్రెస్‌లోని ఆరుగురు ఎమ్మెల్యేలతోనూ అమరీందర్ సింగ్ చర్చలు జరిపారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి తగిన మెజారిటీ లేదు. అయినప్పటికీ ఆ రాష్ట్రం నుంచి బీజేపీ ఇటీవల రాజ్యసభ సీటును గెల్చుకుంది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో పాటు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ వైపు మొగ్గుచూపడంతో ఫలితం మారిపోయింది. హిమాచల్ రాజ్యసభ సీటు కూడా బీజేపీ ఖాతాలో జమైంది. కెప్టెన్ అమరీందర్ సింగ్‌ పావులు కదుపుతున్న విషయం దాదాపు రెండు వారాల క్రితమే కాంగ్రెస్ అధిష్టానానికి తెలిసిందని.. అంతర్గతంగా ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు హస్తం పార్టీ చర్యలు మొదలుపెట్టినా అవి ఫలించలేదని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed