Karnataka Assembly: రాత్రంతా అసెంబ్లీలోనే నిద్రపోయిన ఎమ్మెల్యేలు

by Harish |
Karnataka Assembly: రాత్రంతా అసెంబ్లీలోనే నిద్రపోయిన ఎమ్మెల్యేలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MUDA) కుంభకోణంపై కర్ణాటక అసెంబ్లీలో చర్చకు డిమాండ్ చేస్తూ బీజేపీ, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు బుధవారం రాత్రంతా అసెంబ్లీలో నిద్రపోయి నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు నిరసనలో భాగంగా, వారు చర్చకు అనుమతించనందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, సిద్ధరామయ్య, స్పీకర్ ఖాదర్‌లకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనలు నిర్వహించారు, ఆ తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్‌.అశోక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే బీవై విజయేంద్ర సహా శాసనసభ్యులు అసెంబ్లీ ప్రాంగణంలో నిద్రించారు.ఈ నిరసనలో విధాన సభలో ప్రతిపక్ష నేత చలవాడి నారాయణస్వామి, సిటి రవి సహా బీజేపీ, జేడీఎస్‌తోపాటు పలువురు శాసనసభ, శాసనమండలి సభ్యులు పాల్గొన్నారు.

ముడా కుంభకోణానికి సంబంధించి విపక్షాలు చర్చకు పట్టుబట్టగా అసెంబ్లీ స్పీకర్ ఖాదర్ దానిని తిరస్కరించి సభను వాయిదా వేశారు. దీంతో ప్రతిపక్ష శాసనసభ్యులు అసెంబ్లీ లోపల నిరసన చేపట్టారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ తెంగినాకై మాట్లాడుతూ ప్రభుత్వం చర్చకు సిద్ధమయ్యే వరకు నిరసన కొనసాగుతుందని అన్నారు. ముడా కుంభకోణాన్ని ఖండిస్తూ, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు విజయేంద్ర డిమాండ్ చేశారు. ఈ కుంభకోణం విలువ రూ.4000 కోట్లని, భూసేకరణ, ప్లాట్ల కేటాయింపుల్లో చాలా అవినీతి జరిగిందని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ ఆర్ పాటిల్ అన్నారు.

ముడా అభివృద్ధి కోసం స్వాధీనం చేసుకున్న భూమిలో అవినీతి జరిగిందని, భూసేకరణ, ప్లాట్ల కేటాయింపుల్లో చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయని కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా సీఎం సిద్దరామయ్య తన భార్య పార్వతి పేరిట నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా భూమిని అప్పగించారని, దీనిని ముడా స్వాధీనం చేసుకుని పరిహారంగా మైసూరులోని ఒక మార్కెట్ ప్రాంతంలో ఆయన భార్యకు స్వాధీనం చేసుకున్న స్థలంతో పోలిస్తే ఎక్కువ విలువ కలిగిన సైట్లు కేటాయించారని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.



Next Story