IDF: హమాస్ కీలక నేతను హతమార్చిన ఇజ్రాయెల్

by Shamantha N |
IDF: హమాస్ కీలక నేతను హతమార్చిన ఇజ్రాయెల్
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌- హమాస్‌ (Israel-Hamas Conflict)ల ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. హమాస్ (Hamas) జరిపిన అక్టోబరు 7 నాటి దాడుల ప్రధాన సూత్రధారిని హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం (IDF) పేర్కొంది. ‘అక్టోబరు 7 నాటి కీలక సూత్రధారి అబ్దల్‌ హదీ సబా (Abdal-Hadi Sabah)ను హతమార్చాం. ఖాన్‌ యూనిస్‌లోని మానవతా సాయం పొందుతున్న ఆయన ఇటీవల జరిగిన వైమానిక దాడుల్లో మృతి చెందారు. సబా అనేక ఉగ్రవాద దాడులకు నాయకత్వం వహించారు. ఇజ్రాయెల్ సైన్యం ఉగ్రవాదులందరికీ వ్యతిరేకంగా పనిచేస్తాయి. అక్టోబర్ 7 ఊచకోతకు కారకులైన వారిని హతమార్చేందుకు మా ఆపరేషన్‌ను కొనసాగిస్తాం’ అని ఐడీఎఫ్ తెలిపింది.

ఇప్పటికే 14 మంది హతం

ఇంతకుముందు, 14 మంది హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ బలగాలు వెల్లడించాయి. అందులో ఆరుగురు అక్టోబర్ 7న జరిగిన మారణకాండలో పాల్గొన్నట్లు పేర్కొన్నాయి. అక్టోబరు 7 దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను గుర్తించి, అంతమొందించేందుకు ఇజ్రాయెల్ బలగాలు, ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ సంయుక్తంగా పనిచేస్తుంది. ఇకపోతే, గతేడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పైకి హమాస్‌ బలగాలు విరుచుకుపడ్డాయి. ఆ దాడుల్లో మొత్తం 1,200 మంది ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 251 మంది కిడ్నాప్‌ అయ్యారు. మధ్యలో తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం వేళ కొందరు బందీలు విడుదలవగా.. ఇంకా 97 మంది హమాస్‌ చెరలోనే ఉన్నారు. అయితే పలు ఘటనల్లో మరికొందరు మృతి చెందారు. ప్రస్తుతం 51 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు ఇజ్రాయెల్‌ మీడియా చెబుతోంది. మరికొందరు చనిపోయారు. ఇప్పటికీ దాదాపు వంద మంది హమాస్ దగ్గర బందీలుగానే ఉన్నారు. హమాస్‌ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 45,541 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,08,338 మందికి గాయాలయ్యాయని పాలస్తీనా ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed