మానవతా సంక్షోభం ఆమోదయోగ్యం కాదు: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భారత్

by samatah |
మానవతా సంక్షోభం ఆమోదయోగ్యం కాదు: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భారత్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా ఏర్పడిన మానవతా సంక్షోభం ఆమోద యోగ్యం కాదని ఐక్యరాజ్యసమితి(యూఎన్ఓ)లో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు. ఈ ఘర్షణ వల్ల పెద్ద ఎత్తున మహిళలు, పిల్లలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఆమె ప్రసంగించారు. ‘గాజాలో ప్రస్తుత పరిస్థితులను చూసి భారత్ తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఇది చాలా తీవ్రమైన మానవతా సంక్షోభం. ఈ ప్రాంతంలో మరింత దుర్బర పరిస్థితి ఏర్పడుతోంది’ అని తెలిపారు. గత నెల 25న ఐక్యరాజ్యసమితి ఆమోదించిన తీర్మానాన్ని సానుకూల చర్యగా భారత్ భావిస్తోందని చెప్పారు. ఈ ఘర్షణలో అనేక మంది పౌరులు మరణిస్తున్నారని, పౌరుల ప్రాణాలను కాపాడటం అత్యవసరమని నొక్కిచెప్పారు.

ఈ ఘర్షణపై భారత్ తన వైఖరిని ఇప్పటికే స్పష్టంగా వెల్లడించిందని చెప్పారు. ఉగ్రదాడి, బంధీలుగా చేసుకునే చర్యలను గతంలోనే ఖండించినట్టు గుర్తు చేశారు. బంధీలుగా ఉన్న వారిని తక్షణమే ఎటువంటి షరతులు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గాజాలో మరింత దుర్భర పరిస్థితి నెలకొనకుండా అక్కడి ప్రజలకు మానవతా సహాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో శాంతి కోసం ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సమాజం చేస్తున్న ప్రయత్నాలు ఎనలేనివని ప్రశంసించారు. పాలస్తీనా ప్రజలకు భారత్ అందించే మానవతా సాయం కొనసాగుతుందని నొక్కి చెప్పారు.

కాగా, గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో ఇప్పటి వరకు 33,207 మంది పాలస్తీనియన్లు మరణించగా..75,933 మంది గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో 14,500 మంది పిల్లలు, 9,560 మంది మహిళలు ఉన్నట్టు గాజా ప్రభుత్వం వెల్లడించింది. ఇక, ఇజ్రాయెల్‌లో 33 మంది పిల్లలతో సహా 1,200 మందికి పైగా మరణించారు. ఇందులో పలువురు విదేశీ పౌరులు సైతం ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed