Modi Ukraine Visit: మోడీ ఉక్రెయిన్ పర్యటనపై అమెరికా ప్రశంసలు

by Shamantha N |   ( Updated:2024-08-27 04:31:41.0  )
Modi Ukraine Visit: మోడీ ఉక్రెయిన్ పర్యటనపై అమెరికా ప్రశంసలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ పర్యటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. మోడీతో, బైడెన్ ఫోన్ కాల్ లో మాట్లాడినట్లు వైట్ హౌజ్ ఓ ప్రకటన విడుదల చేసింది. మోడీ ఉక్రెయిన్ పర్యటన, సెప్టెంబర్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు పేర్కొంది. మరోవైపు, మానవతా సాయానికి మోడీ మద్దతుగా నిలిచారని బైడెన్ పేర్కొన్నారు. ‘‘పోలండ్, ఉక్రెయిన్‌ పర్యటన గురించి చర్చించడానికి మోడీతో ఫోన్‌లో మాట్లాడాను. ఆయన శాంతి సందేశం, మానవతావాద మద్దతు ప్రశంసనీయం. ఇండో-పసిఫిక్‌లో శాంతి, శ్రేయస్సుకు దోహదపడేందుకు క్వాడ్ వంటి ప్రాంతీయ సమూహాలతో సహా భారత్ తో కలిసి నిబద్ధతతో పనిచేస్తాం ’’ అని బైడెన్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

బంగ్లాదేశ్ పరిస్థితులపై చర్చ

బంగ్లాదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనా ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు మోడీ వెల్లడించారు. బంగ్లాలోని హిందువులు, మైనారిటీలందరికీ భద్రత కల్పించేలా చూడాలని కోరారు. ఫోన్ సంభాషణలో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలెన్నో సమగ్రంగా చర్చకు వచ్చాయని, పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నామని మోడీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు. గత నెలలో మోడీ చేపట్టిన రష్యా పర్యటనపై అమెరికా సహా ప్రపంచదేశాలు అసహనం వ్యక్తం చేశాయి. ఇలాంటి టైంలో మోడీ ఆగస్టు 23న ఉక్రెయిన్ లో పర్యటించారు. రష్యాతో చర్చలు జరిపి ఓ పరిష్కారానికి రావాలని.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి మోడీ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed