Himachal : రాష్ట్రం కోసం రెండు నెలల జీతభత్యాలు త్యాగం.. సీఎం,మంత్రుల నిర్ణయం

by Hajipasha |
Himachal : రాష్ట్రం కోసం రెండు నెలల జీతభత్యాలు త్యాగం.. సీఎం,మంత్రుల నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో : హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరదలతో అతలాకుతలమై ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తమ రాష్ట్రానికి అండగా నిలిచేందుకు రెండు నెలల పాటు జీతభత్యాలను తీసుకోకూడదని సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు, మంత్రులు నిర్ణయించారు. దీనిపై ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు గురువారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలోని చీఫ్ సెక్రటరీలు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఇందులో భాగమయ్యారని వెల్లడించారు. అధికార, విపక్ష ఎమ్మెల్యేలు సైతం ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని సీఎం కోరారు. జూన్‌ 27 నుంచి ఆగస్టు 9 మధ్య కాలంలో వర్షాలకు సంబంధించిన వేర్వేరు ఘటనల్లో 100 మంది చనిపోయారు.

ఆగస్టు నెలలో కులు, మండి, షిమ్లా జిల్లాల్లో వరదల కారణంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురి ఆచూకీ గల్లంతైంది. వంతెనలు,రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రతికూల పరిణామాల వల్ల రాష్ట్రంలో దాదాపు రూ.10 వేల కోట్ల ఆస్తినష్టం సంభవించిందని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. విపత్తు అనంతర పునర్నిర్మాణ పనులకు రూ.9వేల కోట్లు అవసరమని, కేంద్రం ఇంకా నిధులు విడుదల చేయలేదని సీఎం సుఖు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed