బెంగళూరు రేవ్ పార్టీ కలకలం..!

by Shamantha N |
బెంగళూరు రేవ్ పార్టీ కలకలం..!
X

దిశ, నేషనల్ బ్యూరో : బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీపై సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు దాడులు చేశారు. జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ పార్టీలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల టైంలో కూడా రేవ్‌ పార్టీ కొనసాగుతోందనే పక్కా సమాచారంతో సీసీబీ పోలీసులు రైడ్ చేశారు. హైదరాబాద్ కు చెందిన ఓ ఈవెంట్ ప్లానర్ ఈ పార్టీ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అనుమతి తీసుకున్న దానికంటే.. ఎక్కువ సేపు పార్టీ నిర్వహించారు. దీంతో యాంటీ నార్కోటిక్స్ అధికారులు దీనిపై దృష్టిపెట్టారు. సీసీబీ బృందం జరిపిన తనిఖీల్లో 17 ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, కొకైన్‌తో సహా డ్రగ్స్‌ను పార్టీలో వాడినట్లు గుర్తించారు. ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్, బెంగళూరు నుండి 25 మంది యువతులతో సహా 100 మందికి పైగా హాజరయ్యారని అధికారులు తెలిపారు. రేవ్‌ పార్టీలో ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. పార్టీకి సమీపంలో పార్కు చేసిన లగ్జరీ కారులో ఎమ్మెల్యే ఐడీ కార్డుని పోలీసులు గుర్తించారు. తెలుగు సినీ ఇండస్టీకి చెందిన పలువురు కూడా పార్టీలో పాల్గొన్నట్లు వార్తలొచ్చాయి. రేవ్ పార్టీ కోసమే ప్రత్యేకంగా కొందరు విమానంలో వచ్చారని అధికారులు చెప్పారు. సీసీబీ దాడుల తర్వాత పార్టీ నిర్వాహకుడు, ముగ్గురు డ్రగ్ పెడ్లర్లతో సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఎండీఎంఏ, కొకైన్ సహా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ చట్టం, ఐపీసీ సెక్షన్ 268 కింద కేసు నమోదు చేసినట్లు ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ ఇన్ స్పెక్టర్ తెలిపారు.

హీరో శ్రీకాంత్, నటి హేమ ఏమన్నారంటే..

రేవ్ పార్టీలో హీరో శ్రీకాంత్, నటి హేమ పాల్గొన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను వారిద్దరూ ఖండించారు. సోషల్ మీడియాలో తాను బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లినట్లు చూపిస్తున్నారని.. ఈ విషయాన్ని నమ్మొద్దని హీరో శ్రీకాంత్ కోరారు. ‘‘నేను బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. అది నేను కాదు. రేవ్ పార్టీకి వెళ్లే కల్చర్ నాది కాదు. దయచేసి ఎవరూ ఈ విషయాన్ని నమ్మొద్దు’’ అని శ్రీకాంత్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు. నటి హేమ స్పందిస్తూ.. ‘‘నేను ఏ రేవ్ పార్టీకి వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఇక్కడ నా ఫాంహౌస్‌లో ఎంజాయ్‌ చేస్తున్నాను. అదంతా ఫేక్‌ న్యూస్‌’’ అని తెలిపారు.

Advertisement

Next Story