- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NDA Alliance: మోడీ, అమిత్ షా లకు షాక్.. ఎన్డీయే కథకు ఎండ్ కార్డు?
దిశ, వెబ్‌డెస్క్: Here are the few reasons for leaving the NDA Alliance| నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) కూటమికి కాలం చెల్లిందా? ఇన్నాళ్లు కమలంతో అంటకాగిన పార్టీలన్నీ ఒక్కొక్కటిగా కూటమికి దూరం అవుతుండటం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఒకనాడు మిత్ర పార్టీలతో కళకళలాడిన ఎన్డీయే కూటమి మోడీ, అమిత్ షా దెబ్బకు మసకబారుతోందా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. గడిచిన మూడేళ్లలో మూడు ప్రధాన పక్షాలు బీజేపీతో మిత్రభేదం వహిస్తూ కూటమి నుండి బయటకు రావడమే నిరూపణలు అనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. బయటకు వస్తున్న పార్టీల కారణాలు ఎవరికి వారివి ప్రత్యేకమైనవే అయినా ఎన్డీయే కూటమి పలుచబడటమే ఇప్పుడు అందరి అనుమానాలకు ఊతమిస్తోంది. ఈ పరిస్థితికి కారణం ఏంటనేది జాతీయ స్థాయిలో చర్చకు వస్తోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ముచ్చటగా మూడోసారి అధికార పీఠం ఎక్కాలని భావిస్తున్న మోడీ, అమిత్ షాల ద్వయానికి మిత్రపక్షాలతో వైరం కలిసి వస్తుందా? లేక కొంప ముంచుతుందా? అనేది ఆసక్తిగా మారింది.
ఒక్కొక్కటిగా దూరం..
జాతీయ ప్రజాస్వామ్య కూటమి 1998లో మాజీ ప్రధాని దివంగత వాజ్ పేయి నాయకత్వంలో స్థాపించబడింది. ఈ కూటమి 1998 నుండి 2004 వరకు అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత 2014, 2019 సాధారణ ఎన్నికల్లో వరుసగా కూటమి ముఖ్య నాయకుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారంలో కొనసాగుతోంది. 2014-19 మధ్యకాలంలో ఎన్డీయేకు టీడీపీ, పీడీపీ, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్‌తంత్రిక్ పార్టీ, బోడో పీపుల్స్ ఫ్రంట్, గోర్ఖా జనముక్తీ మోర్చా, గోవా ఫార్వర్డ్ పార్టీ, ఎండీఎంకే, డీఎండీకే, శివసేన, అకాలీదళ్ దూరం కాగా తాజాగా బీహార్‌లో అధికార కూటమి నుండి జేడీ(యు) గుడ్ బై చెప్పేసింది. అయితే గడిచిన మూడేళ్లలో మూడు ప్రధాన మిత్రపక్షాలైన శివసేన, అకాలీదళ్, జేడీ(యు) ఎన్డీయే కూటానికి దూరం కావడం కాషాయ పార్టీకి భారీ షాక్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఆ ఒక్క నినాదమే కొంప ముంచుతోందా?:
వాస్తవానికి 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సొంత మెజార్టీ సాధించిన రోజే ఎన్డీయే కథ కంచికి చేరినట్లుగా చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో లోక్ సభలో బీజేపీ సొంతగా సాధారణ మెజారిటీ (272)కు 10 సీట్లు అదనంగా (282) గెలుచుకోగలిగింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో తన బలాన్ని 303కు పెంచుకోవడంతో ప్రాంతీయ పార్టీలపై బీజేపీ శీతకన్ను పడిందనే టాక్ ఎన్డీయే కూటమి నుండి బయటకు వస్తున్న పార్టీలు ఆరోపిస్తున్నాయి. తమ డిమాండ్లను బీజేపీ పట్టించుకోవడం లేదనేది ప్రధానమైన ఆరోపణ. తమతో ప్రెండ్షిప్ కొనసాగిస్తూనే తమ రాష్ట్రాల్లో తమ పాత్రను తగ్గించి బీజేపీ బలపడేలా స్కెచ్ వేస్తోందనే విమర్శలు వచ్చాయి. సమయం, సందర్భం వచ్చిన రోజు పక్కాగా తన ప్లాన్ ను అమలు చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఓ వైపు తమకు తిరుగులేని మెజార్టీ దక్కడం, మరో వైపు ప్రాంతీయ పార్టీలతో అంటగాగక తప్పని పరిస్థితికి కాంగ్రెస్ పడిపోవడంతో రానున్న సొంత మెజార్టీపైనే బీజేపీ ఫోకస్ పెట్టిందనే ప్రచారం జోరందుకుంది.
బీజేపీకి కలిసి వచ్చేలా ఏన్డీయే చీలిక?
ఎన్డీయే కూటమి నుండి మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరం కావడంపై బీజేపీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి విపక్షాలు ఏకం కావాలనే ప్రయత్నంలో ఉండగా ఎన్డీయే కూటానికి బీటలు వారడం బీజేపీకి ఎదురుదెబ్బగా కొంత మంది నేతలు అభిప్రాయపడుతుంటే మరి కొంత మంది నేతలు ఇది తమకు మంచి పరిణామమే అని వాదిస్తున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలకు ఎన్డీయే కూటమి ఉపయోగపడినా రాష్ట్రాల్లో పాగా వేయాలంటే బీజేపీ సొంతంగానే ముందుకు వెళ్లడమే మంచిదనే అభిప్రాయాలు ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. బిహార్‌లో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువే అయినా ఇక్కడ పైచేయి సాధించేందుకు తాజా పరిణామం కలిసివస్తుందనేది పార్టీ నేతల అభిప్రాయం.
పార్టీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా బీజేపీ పెద్దలే క్రమక్రమంగా ఎన్డీయే కూటమికి చీలికలు తీసుకువస్తున్నారా? అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రాల వరకు ఈ లాజిక్ వినడానికి బాగానే ఉన్నా లోక్ సభ స్థానాల విషయంలో ఈ ప్రయోగం ఫలితం ఇస్తుందా అనేది సందేహాస్పదమే. ఓ వైపు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలు మోడీపై పోరాటానికి ప్రాంతీయ పార్టీలనన్నింటిని ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఎన్డీయేలో చీలకలు మోడీ, అమిత్ షాలకు ఇబ్బందికరంగా మారొచ్చనే అభిప్రాయాలు లేకపోలేదు. ప్రస్తుతం చిన్నా చితకా పార్టీలు ఎన్డీయోలో భాగస్వామ్యంగా ఉన్నా అవి అంతగా ప్రభావం ఎంత మేరకు అనేదానిపై రాజకీయ వర్గాల్లో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. బలమైన ఓట్ షేరింగ్ కలిగిన పార్టీలు తమతో స్నేహాన్ని తెంచుకోవడంపై బీజేపీ ఆలోచనలో పడినట్లైందనే మాట వినిపిస్తోంది. మరి ఈ సిట్యూయేషన్‌ను ఎలా ఓవర్ కమ్ చేస్తారనేది బీజేపీ పెద్దల మీద ఆధారపడి ఉంది.
ఇది కూడా చదవండి: 'సామాన్యులు దాని కోసం నిలబడినప్పుడే మార్పు వస్తుంది'
- Tags
- NDA Alliance