అరుణాచల్ ప్రదేశ్‌‌లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

by Harish |
అరుణాచల్ ప్రదేశ్‌‌లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
X

దిశ, నేషనల్ బ్యూరో: రాబోయే రెండు రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్‌‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా పపుమ్ పారే, పశ్చిమ కమెంగ్ జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది, అలాగే మే 29, 30 తేదీల్లో పక్కే-కేసాంగ్, సియాంగ్, లోహిత్, ఈస్ట్ కమెంగ్, వెస్ట్ కమెంగ్, కురుంగ్ కుమే, వెస్ట్ సియాంగ్, దిగువ దిబాంగ్ వ్యాలీ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రంలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యమైన పనులు ఉంటేనే బయటకు రావాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పెమా ఖండూ రాష్ట్ర ప్రజలను ఎక్స్‌లో కోరారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినట్లయితే దయచేసి జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలని సీఎం సూచించారు. ఈ సందర్భంగా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని పలు సూచనలు అందించారు. భారీ వర్షపాతం కారణంగా ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న కొండచరియలు విరిగిపడవచ్చు, రోడ్లపై ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, అలాగే ప్రజలు కొండచరియలు విరిగిపడే ప్రాంతాలకు వెళ్ళకుండా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Advertisement

Next Story