దేవుడు రాజకీయాల్లో ఉండద్దు.. గుడి కట్టి ప్రసాదం సమర్పిస్తాం: మమతా బెనర్జీ

by Harish |
దేవుడు రాజకీయాల్లో ఉండద్దు.. గుడి కట్టి ప్రసాదం సమర్పిస్తాం: మమతా బెనర్జీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల ప్రధాని మోడీ నన్ను దేవుడి పంపించి ఉండవచ్చు అని వ్యాఖ్యానించగా, తాజాగా దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎగతాళి చేశారు. కోల్‌కతా దక్షిణ్ లోక్‌సభ నియోజకవర్గంలోని బెహలాలో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మమత మాట్లాడుతూ, "దేవుడు అనే వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు, అల్లర్లు సృష్టించద్దు.. నేను అతనికి గుడి కట్టించి, పూలు, మిఠాయిలు, ఇష్టమైతే ఢోక్లా కూడా సమర్పిస్తాను" అని మోడీని ఉద్దేశిస్తూ అన్నారు.

ఇంతకుముందు మోడీ ఒక జాతీయ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, “మా అమ్మ జీవించి ఉన్నంత వరకు, నేను జీవశాస్త్రపరంగా పుట్టానని అనుకున్నాను. ఆమె మరణించిన తరువాత, నా అనుభవాలను చూస్తే, నన్ను దేవుడు పంపించాడని నమ్ముతున్నాను. ఈ బలం నా శరీరం నుండి కాదు. అది నాకు భగవంతుడు ప్రసాదించాడు. నేను దేవుడు పంపిన సాధనం తప్ప మరొకటి కాదు'' అని అన్నారు. ఈ వ్యాఖ్యలను మమత తాజా ఎన్నికల ర్యాలీలో ఎగతాళి చేశారు.

అంతకు ముందు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ప్రధాని మోడీ చేసిన "దేవుడు పంపిన" వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. అదానీకి సహాయం చేయడానికే మోడీని దేవుడు పంపాడు.. పేదల కోసం కాదని విమర్శించారు. గత వారం బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సంబిత్ పాత్ర కూడా జగన్నాథ భగవానుడు ప్రధాని నరేంద్ర మోడీకి భక్తుడు అని పేర్కొనగా ఆ వ్యాఖ్యలు కూడా తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆయన వ్యాఖ్యలపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఇతర నేతలు విమర్శలు చేశారు.

Advertisement

Next Story