G20 Summit: రేపు భారత్‌కు బైడెన్, రిషి సునాక్.. భారీ ఏర్పాట్లు

by Vinod kumar |   ( Updated:2023-09-07 16:12:50.0  )
G20 Summit: రేపు భారత్‌కు బైడెన్, రిషి సునాక్.. భారీ ఏర్పాట్లు
X

న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అగ్రదేశాల అధినేతలు శుక్రవారం భారత్‌లో అడుగుపెట్టనున్నారు. శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరగనున్న ఈ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కట్టుదిట్టమైన భద్రతకు నగరమంతా 1.3 లక్షల మంది భద్రతా సిబ్బంది మోహరించి ఉన్నారు. వందలాది డ్రోన్లతో నిఘా పెట్టారు. 400 మంది అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉన్నారు.

ఈ సమావేశాలకు ఒకరోజు ముందుగానే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, కెనడా పీఎం జస్టిన్ ట్రూడోతోపాటు మరిన్ని దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరుకానున్నారు. జీ20 సదస్సు ఢిల్లీలోని ‘భారత్ మండపం కన్వెషన్ సెంటర్’లో జరగనుంది. కూటమిలోని సభ్య దేశాల ప్రతినిధులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాతావరణం, స్థిరమైన అభివృద్ధి వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ సమ్మిట్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ హాజరవడం లేదు.

ముందుగా చేరుకోనున్న రిషి..(Rishi Sunak)

దేశాధినేతల్లో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ముందుగా ఢిల్లీకి చేరుకోనున్నారు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం 1:40కి ఢిల్లీలో ల్యాండ్ అవుతారు. కేంద్రమంత్రి అశ్వినీ కుమార్ చౌబే ఆహ్వానం పలుకుతారు. సునాక్ తర్వాత 2:15కు జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా పాలమ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో దిగనుండగా, ఆయనకూ అశ్వినీ కుమార్ చౌబేనే ఆహ్వానం పలుకుతారు.

రాత్రి 7గంటలకు బైడెన్..(Joe Biden)

ఇక, రాత్రి 6:55కి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఢిల్లీలో ల్యాండ్ అవనుండగా, కేంద్రమంత్రి, రిటైర్డ్ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ స్వాగతం పలకనున్నారు. బైడెన్ చేరుకోగానే కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో 7గంటలకు చేరుకోనుండగా, ఆయనను కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రిసీవ్ చేసుకోనున్నారు. ఇక, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు బదులుగా ఆ దేశ ప్రధాని లీ క్వియాంగ్ 7:45కు ఢిల్లీలో దిగనుండగా, ఆయనకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆహ్వానం పలుకుతారు.

వీరితోపాటు అర్జెంటీనా, ఇటలీ, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, కొరియా, ఈజిప్ట్, స్పెయిన్, నెదర్లాండ్స్, బ్రెజిల్, ఇండోనేషియా, తుర్కియే, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాల అధినేతలు/ప్రతినిధులు సైతం శుక్రవారమే ఢిల్లీకి చేరుకోనుండగా, శనివారం జర్మనీ, ఫ్రాన్స్, మారిషస్ అధినేతలు, ప్రతినిధులు రానున్నారు. వీరంతా తమకు కేటాయించిన హోటళ్లలో బస చేయనున్నారు.

Advertisement

Next Story