‘వన్ ఆర్డినెన్స్, వన్ నోటిఫికేషన్’ ఇవ్వాల్సిందే.. కేంద్రానికి రైతు సంఘాల అల్టిమేటం

by Hajipasha |
‘వన్ ఆర్డినెన్స్,  వన్ నోటిఫికేషన్’ ఇవ్వాల్సిందే.. కేంద్రానికి రైతు సంఘాల అల్టిమేటం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలు హోరెత్తుతున్న వేళ ఆదివారం రాత్రి రైతు సంఘాల నాయకులు, కేంద్ర మంత్రుల మధ్య నాలుగో విడత చర్చలు జరిగాయి. చండీగఢ్ వేదికగా జరిగిన ఈ సంప్రదింపులు సానుకూల వాతావరణంలోనే సాగినట్లు తెలిసింది. పంటలకు కనీస మద్దతు ధరల(ఎంఎస్పీ)పై చట్టం చేసే అంశంతో పాటు రైతుల ఇతర డిమాండ్లపై నిర్ణయాన్ని తీసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని రైతు నేతలను కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద రాయ్ కోరినట్లు సమాచారం. రైతుల డిమాండ్లను పరిశీలించి ప్రభుత్వానికి సిఫార్సులను చేసేందుకు ప్రత్యేక కమిటీని నియమించేందుకు కేంద్ర సర్కారు సిద్ధంగా ఉందని మంత్రులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దీనికి రైతు సంఘాల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందనేది తెలియరాలేదు. ‘ఎంఎస్పీ గ్యారంటీ లా’పై ఒక ఆర్డినెన్స్, ‘ఎంఎస్ స్వామినాథ్ సిఫార్సుల’పై ఒక నోటిఫికేషన్‌ను ఇవ్వాలని కేంద్ర మంత్రులను రైతు నేతలు డిమాండ్ చేశారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఓవైపు చర్చలు జరుగుతుండగానే మరోవైపు భారతీయ కిసాన్ యూనియన్ (చారిణి) జాతీయ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చారుణి కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు. ‘‘మేం హర్యానా రైతులమంతా ఎంఎస్పీ కోసమే ఏకమయ్యాం. కేంద్ర సర్కారుతో ఒకవేళ చర్చలు విఫలమైతే ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తాం. హర్యానాలోని అన్ని యూనియన్లు, ఖాప్స్, టోల్ కమిటీలు సహా రైతు సంఘాలు కలిసి నిరసన తెలుపుతాయి’’ అని ప్రకటించారు.

పంజాబ్‌, హర్యానాలలో ఇంటర్నెట్ బ్యాన్ పొడిగింపు

ఢిల్లీ మార్చ్‌కు పిలుపునిచ్చిన రైతులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వరుసగా ఆరో రోజూ (ఆదివారం) ఢిల్లీ సరిహద్దులలో నిరసనలు కొనసాగించారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు పాటియాలా, సంగ్రూర్, ఫతేఘర్ సాహిబ్‌తో పాటు పంజాబ్‌లోని కొన్ని జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల నిషేధాన్ని ఫిబ్రవరి 24 వరకు పొడిగించారు. ఇంతకుముందు ఫిబ్రవర్ 12 నుంచి 16 వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. మరోవైపు మొబైల్ ఇంటర్నెట్ బ్యాన్‌ను హర్యానా ప్రభుత్వం ఈనెల 19(సోమవారం) వరకు పొడిగించింది. మొత్తం ఏడు జిల్లాలు అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిసార్, ఫతేహాద్, సిర్సాలలో నిషేధం విధించారు. ఈ ప్రాంతాలు రైతుల నిరసనలతో అత్యధికంగా ప్రభావితమయ్యాయి. ఇక్కడి పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నట్టు అధికారులు తెలిపారు. తప్పుడు సందేశాలు వ్యాప్తి చెందుతున్నాయనే ఆరోపణలతో ఇంటర్నెట్ నిలిపి వేస్తున్నట్టు వెల్లడించారు. కాగా, తమ డిమాండ్ల పరిష్కారానికి ఢిల్లీ మార్చ్‌కు బయలుదేరిన రైతులను పంజాబ్-హర్యానాలోని శంభు సరిహద్దులో పోలీసులు అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Next Story