Kolkata: మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

by Harish |
Kolkata: మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. తన పదవీ కాలంలో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను సీబీఐ సెప్టెంబర్ 2న అరెస్ట్ చేయగా, అప్పటి నుంచి ఎనిమిది రోజుల కస్టడీకి పంపింది. తాజాగా ఆ గడువు ముగియడంతో మరికొద్ది రోజులు కస్టడీకి అప్పగించాలని ఏజెన్సీ కొరగా వారి అభ్యర్థన మేరకు కోల్‌కతా అలీపూర్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు అతని జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. అలాగే, అతని భద్రతా సిబ్బంది అఫ్సర్ అలీ, ఇద్దరు సహచరులు, కాంట్రాక్టర్లు విక్రేతలు బిప్లబ్ సిన్హా, సుమన్ హజ్రాలను కూడా కోర్టు సెప్టెంబర్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

విచారణ సందర్భంగా సీబీఐ.. అవసరమైతే మళ్లీ వారి కస్టడీని కోరుతామని కోర్టుకు తెలిపింది. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన నేపథ్యంలో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ అక్రమాలు కూడా వెలుగులోకి రావడంతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆస్పత్రిలో మెడికల్‌ హౌస్‌ సిబ్బంది నియామక ప్రక్రియను దుర్వినియోగం చేసి మాజీ ప్రిన్సిపాల్‌ తన ఇష్టానుసారం వైద్యులను నియమించుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఆసుపత్రి కాంట్రాక్టులను ఘోష్ తన సహాయకులకు మంజూరు చేశారని, తద్వారా నిబంధనలను ఉల్లంఘించారని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది.

Advertisement

Next Story

Most Viewed