జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు బెయిల్‌

by Harish |
జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు బెయిల్‌
X

దిశ, నేషనల్ బ్యూరో: భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు రాష్ట్ర హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. బరియాతులో 8.86 ఎకరాల భూమి రికార్డులను తారుమారు చేసి, నకిలీ పత్రాలను ఉపయోగించి కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా సంపాదించారనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జనవరి 31న సోరెన్‌ను అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం సోరెన్ రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైల్లో ఉన్నారు.

శుక్రవారం విచారణ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంగన్ ముఖోపాధ్యాయ, హేమంత్ సోరెన్‌కు రూ.50 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. ప్రాథమిక ఆధారాల పరంగా హేమంత్‌ సోరెన్‌ నేరానికి పాల్పడలేదని, బెయిల్‌పై ఉన్నప్పుడు నేరం చేసే అవకాశాలు కూడా లేవని గుర్తిస్తున్నాం, అందుకే ఆయనకు బెయిల్‌ ఇస్తున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

హేమంత్ సోరెన్ పిటిషన్‌పై చివరిసారిగా జూన్ 13న జార్ఖండ్ హైకోర్టులో విచారణ జరిగింది. ఆ రోజు సోరెన్‌ తరపున న్యాయవాది కపిల్ సిబల్ బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో వాదించారు. దీనిని ఈడీ తరపున న్యాయవాది వ్యతిరేకించారు, హేమంత్ సోరెన్‌కు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ రంగన్ ముఖోపాధ్యాయ తన నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. తాజాగా విచారణ తర్వాత బెయిల్ మంజూరు చేశారు.

గతంలో చాలా సార్లు ఆయన బెయిల్ కోసం పీఎంఎల్‌ఏ కోర్టు నుంచి మొదలుకుని, హైకోర్టు, సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు, అయితే ఆయన బెయిల్ దరఖాస్తును పదే పదే తిరస్కరించగా, ఎట్టకేలకు ఇప్పుడు జార్ఖండ్ హైకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. హేమంత్ సోరెన్‌కు బెయిల్ లభించడం పట్ల జార్ఖండ్ ముక్తి మోర్చా సంతోషం వ్యక్తం చేసింది. అంతకుముందు కస్టడీలో ఉండగానే హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన సన్నిహితుడు చంపాయ్ సోరెన్‌కు బాధ్యతలు అప్పగించారు. పార్టీ కార్యక్రమాలను ఆయన సతీమణి కల్పనా సోరెన్ చూసుకుంటున్నారు. జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు హేమంత్ సోరెన్ బెయిల్ పొందడం పార్టీకి పెద్ద ఉపశమనం.

Next Story

Most Viewed