ప్రజాస్వామిక సంస్థగా మారిన తీవ్రవాద సంస్థ.. తొలి మీటింగ్ తీర్మానాలివీ

by Hajipasha |   ( Updated:2024-01-24 12:23:39.0  )
ప్రజాస్వామిక సంస్థగా మారిన తీవ్రవాద సంస్థ.. తొలి మీటింగ్ తీర్మానాలివీ
X

దిశ, నేషనల్ బ్యూరో : యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ఉల్ఫా)పై 44 ఏళ్ల క్రితం కేంద్ర సర్కారు విధించిన నిషేధం ఎట్టకేలకు తొలగిపోయింది. గతంలో అడవుల్లో ఉంటూ తీవ్రవాదాన్ని వినిపించిన ఆ సంస్థ సభ్యులు.. ఇక ప్రజల మధ్య ఉంటూ ప్రజాస్వామిక రాగాన్ని ఆలపించనున్నారు. గతేడాది డిసెంబరు 29న కేంద్ర సర్కారుతో కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఉల్ఫా (మితవాద వర్గం) ఒక సాధారణ ప్రజా సంఘంగా ఆవిర్భవించింది. దీని తొలి సమావేశం మంగళవారం అసోంలోని దర్రాంగ్ జిల్లాలో జరిగింది. తమ సంస్థ ఇకపై ప్రజాస్వామిక పోరాటాలతో ముందుకు సాగుతుందని ఈ మీటింగ్‌లో ప్రకటించామని ఉల్ఫా (మితవాద వర్గం) ప్రధాన కార్యదర్శి అనుప్ చెటియా మీడియాకు తెలిపారు. కేంద్ర సర్కారు, అసోం రాష్ట్ర సర్కారు, ఉల్ఫా (మితవాద వర్గం) మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందంలోని నిబంధనల అమలుపై పర్యవేక్షించేందుకు ఏడుగురు సభ్యుల పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేశామని నిర్ణయించినట్లు వెల్లడించారు.ఈ కమిటీ కన్వీనర్‌గా తానే వ్యవహరిస్తానని అనుప్ చెటియా చెప్పారు. ‘అసోమ్ జాతీయ వికాస్ మంచ్’ పేరుతో ఒక సామాజిక, సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ సంస్థ అసోం సమాజంలోని సాంస్కృతిక, భాషా గుర్తింపులను కాపాడటానికి పని చేస్తుందన్నారు. కాగా, ఉల్ఫా 1979 ఏప్రిల్ 7న ఏర్పాటైంది. దాని తీవ్రవాద కార్యకలాపాల కారణంగా వెంటనే నిషేధానికి గురైంది. ఇక పరేష్ బారువా నేతృత్వంలోని ఉల్ఫా అతివాద వర్గం కేంద్ర సర్కారుతో చర్చలకు సిద్ధంగా లేదు. ఉల్ఫాలోని మితవాద వర్గం మాత్రం కేంద్ర సర్కారుతో చర్చలు జరిపి సాయుధ పోరాటాన్ని విరమించింది.

Advertisement

Next Story