ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: ముగ్గురు కార్మికులు మృతి

by vinod kumar |
ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: ముగ్గురు కార్మికులు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు ప్రాణాలో కోల్పోగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో శనివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. దీంతో ఆ సమయంలో ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున 3:35 గంటలకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 14 ఫైరింజన్లను మోహరించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

భవనం లోపల చిక్కుకున్న తొమ్మిది మంది కార్మికులను రక్షించారు. గాయపడిన వారిని నరేలాలోని ఓ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిని శ్యామ్ (24), రామ్ సింగ్ (30), బీర్‌పాల్ (42)గా గుర్తించారు. పైప్‌లైన్‌లో గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి తెలిపారు. యూనిట్ ప్రాసెస్ చేసిన మూంగ్ పప్పు వేయించడానికి ఉపయోగించే బర్నర్‌లకు గ్యాస్ సరఫరా చేస్తారని, మంటలు వ్యాపించడంతో అది తీవ్రంగా వేడెక్కి ఫలితంగా పేలుడు సంభవించిందని వెల్లడించారు.

Advertisement

Next Story